ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టులో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటికే వరుసగా రెండు టెస్ట్‌ల్లో ఓడి 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో చేజార్చుకున్న ఆ జట్టుకు కరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.రెండో టెస్ట్ ముగిసిన వెంటనే జరిపిన పరీక్షల్లో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, తాజాగా ఇవాళ (జూన్ 16) జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే మహమ్మారి బారిన పడినట్లు రిపోర్టులు వచ్చాయి.
దీంతో కివీస్ మేనేజ్‌మెంట్ జట్టు సభ్యులందరికీ మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు నమూనాలు సేకరించి, కాన్వేను ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌కు తరలించింది. కాన్వేకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో న్యూజిలాండ్ బృందంలో కేసుల సంఖ్య ఐదుకు చేరింది. రెండో టెస్ట్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆతర్వాత సపోర్టింగ్ స్టాఫ్‌లో ఇద్దరు సభ్యులు కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే.
ఓ పక్క వరుస ఓటములు, మరో పక్క కోవిడ్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కివీస్ జట్టును గాయాల బెడద కూడా వేధిస్తుంది. తొలి టెస్ట్ సందర్భంగా ఆల్‌రౌండర్ కొలిన్ గ్రాండ్‌హోమ్ గాయపడగా, అతనికి రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన బ్రేస్‌వెల్ కరోనా బారిన పడ్డాడు. అలాగే రెండో టెస్ట్ సందర్భంగా మరో ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్ కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది. రెండో టెస్టు ఆఖరి రోజు బౌలింగ్ చేస్తూ జేమీసన్ గాయపడ్డాడని.. అతని గాయం చాలా తీవ్రమైందని సమాచారం. దీంతో జేమీసన్ కూడా మూడో టెస్ట్ ఆడటం అనుమానమేనని తెలుస్తోంది.
దీంతో చివరిదైన మూడో టెస్ట్‌కు న్యూజిలాండ్ పూర్తి జట్టును బరిలోకి దించేది అనుమానంగా మారింది. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ జూన్ 23 నుంచి ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే, ట్రెంట్ బ్రిడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. రసవత్తరంగా సాగిన ఈ సమరంలో ఇంగ్లండ్ బ్యాటర్లు జూలు విదిల్చి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. బెయిర్‌స్టో సూపర్ శతకంతో (92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 136), బెన్ స్టోక్స్ (70 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 75) అజేయమైన అర్ధశతకంతో చెలరేగి క్రికెట్ ప్రేమికులకు టీ20 క్రికెట్ మజాను అందించారు.
చదవండి: విజయానందంలో ఉన్న ఇంగ్లండ్‌కు ఐసీసీ షాక్..
Comments
Please login to add a commentAdd a comment