ఇంకా ఉంది!
టాప్ ఆర్డర్ విఫలమైనా... మెకల్లమ్, వాట్లింగ్‌లు సమయోచితంగా ఆడటంతో రెండో టెస్టులో న్యూజిలాండ్ నిలబడింది. వీరిద్దరు కీలక సమయంలో మెరుగైన భాగస్వామ్యాన్ని జోడించారు. జట్టుకు ఆధిక్యాన్ని అందించారు. మరోవైపు ఉదయం సెషన్‌లో ఆకట్టుకున్న భారత బౌలర్లు ఆ తర్వాత నిరాశపర్చారు. ఫలితంగా మూడో రోజే గెలుపు ఖాయమనుకున్న మ్యాచ్‌ను నాలుగో రోజుకు తీసుకెళ్లారు.
వెల్లింగ్టన్: రెండు కీలక క్యాచ్‌లు జారవిడవడంతో పాటు చివరి రెండు సెషన్లలో భారత బౌలర్ల నిరాశజనక ప్రదర్శనతో మూడో రోజే ముగుస్తుందనుకున్న రెండో టెస్టు నాలుగో రోజుకు వెళ్లింది. కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (237 బంతుల్లో 114 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్సర్), వాట్లింగ్ (208 బంతుల్లో 52 బ్యాటింగ్; 4 ఫోర్లు) వీరోచిత బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌కు స్వల్ప ఆధిక్యాన్ని (6 పరుగులు) అందించారు.
దీంతో బేసిన్ రిజర్వ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.... ఆదివారం మూడో రోజు కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 99 ఓవర్లలో 5 వికెట్లకు 252 పరుగులు చేసింది. తొలి సెషన్‌లో జహీర్ చకచకా రెండు వికెట్లు తీశాడు. అయితే రెండు, మూడో సెషన్‌లో ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో రోజంతా బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు 4 వికెట్లతో సరిపెట్టుకున్నారు.
జహీర్ చకచకా...
ఓవర్‌నైట్ స్కోరు 24/1తో మూడో రోజు ఆట కొనసాగించిన కివీస్ బ్యాట్స్‌మెన్ విలియమ్సన్ (22 బంతుల్లో 7), రూథర్‌ఫోర్డ్ (55 బంతుల్లో 35; 6 ఫోర్లు) డిఫెన్స్‌కు మొగ్గు చూపారు. మ్యాచ్‌ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వీలైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించారు. అయితే వీళ్ల ఆశలపై జహీర్ నీళ్లు చల్లాడు. ఆట రెండో ఓవర్‌లోనే ఓ అద్భుతమైన బంతికి విలియమ్సన్‌ను అవుట్ చేశాడు. తర్వాత లాథమ్ (64 బంతుల్లో 29; 3 ఫోర్లు), రూథర్‌ఫోర్డ్ నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను కొనసాగించారు.
ఫలితంగా 16వ ఓవర్‌లో కివీస్ జట్టు 50 పరుగులకు చేరుకుంది. కానీ తర్వాతి ఓవర్‌లోనే జహీర్ బంతిని ఆడబోయి రూథర్‌ఫోర్డ్... ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో వచ్చిన మెకల్లమ్ ఆచితూచి ఆడాడు. అయితే 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి జారవిడవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అడపాదడపా బౌండరీలు కొడుతూ లాథమ్ నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే లంచ్‌కు ఒక్క నిమిషం ముందు షమీ బౌలింగ్‌లో బంతిని పుష్ చేయబోయి కీపర్ చేతికి చిక్కాడు. ఫలితంగా కివీస్ 87/4 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది.
మెకల్లమ్ హవా
తొలి సెషన్‌లో ఆకట్టుకున్న భారత బౌలర్లు లంచ్ తర్వాత కూడా అదే ఊపును ప్రదర్శించారు. సరైన ప్రాంతాల్లో బంతులు వేస్తూ అండర్సన్ (2)ను పూర్తిగా కట్టడి చేశారు. ఓ మూడు ఓవర్ల తర్వాత ఒత్తిడిని జయించలేని అండర్సన్ చివరకు జడేజా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో న్యూజిలాండ్ 94 పరుగులకు 5 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. తర్వాత వాట్లింగ్‌తో కలిసి మెకల్లమ్ ఇన్నింగ్స్‌ను తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నాడు.
స్కోరును ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా వికెట్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చాడు. అదే సమయంలో భారత బౌలర్లు ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా 55వ ఓవర్‌లో 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మెకల్లమ్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను ఇషాంత్ వదిలేయడం జట్టును ఘోరంగా దెబ్బతీసింది. తర్వాత ఈ జోడి ఒకటి, రెండు పరుగులతో సరిపెట్టుకోవడంతో స్కోరు బోర్డు నెమ్మదిగా కదిలింది.
భారత బౌలర్లు విఫలం
టీ తర్వాత భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో జడేజా బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన మెకల్లమ్ 146 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఈ జోడి మరింత అప్రమత్తంగా ఆడింది. జడేజా బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టి మెకల్లమ్ దూకుడును చూపెట్టాడు. ఈ భాగస్వామ్యాన్ని తొందరగా విడదీయాలనే ఉద్దేశంతో ధోని 80వ ఓవర్ కాగానే కొత్త బంతిని తీసుకున్నాడు. కానీ మెకల్లమ్, వాట్లింగ్ ఓపికగా ఆడుతూ 254 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు.
చివరకు 94 పరుగుల వద్ద ఇషాంత్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ కొట్టి మెకల్లమ్ కెరీర్‌లో 9వ సెంచరీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌లో వాట్లింగ్ కూడా నిలకడగా ఆడుతూ 190 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఫలితంగా ఈ ఇద్దరి మధ్య 158 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఇషాంత్ బౌలింగ్‌లో మరో ఫోర్ కొట్టిన మెకల్లమ్ తన జట్టును ఆధిక్యంలో నిలిపాడు.
సెషన్-1 ఓవర్లు: 25.1; పరుగులు: 63; వికెట్లు: 3
సెషన్-2 ఓవర్లు: 29.5; పరుగులు: 59; వికెట్లు: 1
సెషన్-3 ఓవర్లు: 35; పరుగులు: 106; వికెట్లు: 0
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 192 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: 438 ఆలౌట్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: ఫుల్టన్ ఎల్బీడబ్ల్యు (బి) జహీర్ 1; రూథర్‌ఫోర్డ్ (సి) ధోని (బి) జహీర్ 35; విలియమ్సన్ (సి) ధోని (బి) జహీర్ 7; లాథమ్ (సి) ధోని (బి) షమీ 29; బ్రెండన్ మెకల్లమ్ బ్యాటింగ్ 114; అండర్సన్ (సి అండ్ బి) జడేజా 2; వాట్లింగ్ బ్యాటింగ్ 52; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (99 ఓవర్లలో 5 వికెట్లకు) 252
వికెట్ల పతనం: 1-1; 2-27; 3-52; 4-87; 5-94
బౌలింగ్: ఇషాంత్ 23-3-63-0; జహీర్ 25-8-60-3; షమీ 25-4-72-1; జడేజా 26-6-49- 1.
గెలిచి తీరుతాం
‘మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. అయినా మేం ఇప్పటికీ మంచి స్థితిలోనే ఉన్నాం. ఈరోజు (ఆదివారం) కొన్ని క్యాచ్‌లు చేజారాయి. కానీ, ఆటలో ఇవి సాధారణమే. సిరీస్‌లో అద్భుతమైన క్యాచ్‌లెన్నో అందుకున్నాం. మెకల్లమ్, వాట్లింగ్‌లు అద్భుతంగా ఆడారు.
అయితే పిచ్ రోజురోజుకూ బౌలర్లకు అనుకూలంగా మారుతోంది. మావాళ్లు సరైన ప్రదేశంలో బంతులు విసరడం ద్వారా పరుగుల్ని నిరోధిస్తున్నారు. ఇక సోమవారం ఉదయం తొందరగా ఒకటి, రెండు వికెట్లు తీయగలిగితే టెయిలెండర్లను ఔట్ చేయడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. మ్యాచ్‌లో కచ్చితంగా గెలుస్తామన్న విశ్వాసముంది.’
-పుజారా, భారత బ్యాట్స్‌మన్
1 భారత్‌పై వేయి పరుగులు చేసిన తొలి న్యూజిలాండ్ క్రికెటర్ మెకల్లమ్ (10 టెస్టుల్లో 1036 పరుగులు). గతంలో గ్రాహం డౌలింగ్ 11 టెస్టుల్లో 964 పరుగులు సాధించాడు.
4 టెస్టుల్లో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్న నాలుగో కివీస్ బ్యాట్స్‌మన్ మెకల్లమ్.