‘బుచ్చిబాబు’ విజేత హైదరాబాద్
ఫైనల్లో తమిళనాడు ఎలెవన్ చిత్తు
చెన్నై: సొంతగడ్డపై ఇటీవలే మొయినుద్దౌలా గోల్డ్ కప్ గెలిచి ఊపు మీదున్న హైదరాబాద్ జట్టు చెన్నైలోనూ అదే జోరు కొనసాగించింది. శుక్రవారం ఇక్కడ ముగిసిన ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ విజేతగా నిలిచింది. ఫైనల్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) ఎలెవన్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ తొలి రోజు గురువారం తమిళనాడు 200 పరుగులకే ఆలౌట్ కాగా... ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. రెండో రోజు హైదరాబాద్ 56.4 ఓవర్లలో 2 వికెట్లకు 201 పరుగులు సాధించి విజయాన్నందుకుంది.
కొల్లా సుమంత్ (115 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ రాయుడు (100 బంతుల్లో 47 నాటౌట్; 7 ఫోర్లు) మూడో వికెట్‌కు అభేద్యంగా 113 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ 35, అక్షత్ రెడ్డి 30 పరుగులు చేశారు. టోర్నీలో మొత్తం 299 పరుగులు సాధించిన కొల్లా సుమంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు దక్కింది. 12 వికెట్లు తీసి టోర్నీలో రెండో స్థానంలో నిలిచిన హైదరాబాద్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మెహదీ హసన్ కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.