గేల్కు లైన్ క్లియరైనట్లే!
మెల్బోర్న్:' ఏ బేబీ నీ కళ్లు చాలా అందంగా ఉన్నాయి. కలిసి డ్రింక్ చేద్దాం వస్తావా.. సిగ్గు పడవద్దు' అంటూ ఆస్ట్రేలియాకు చెందిన మహిళా జర్నలిస్ట్ పై వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. ఈ ఏడాది బిగ్ బాష్ లీగ్ సందర్భంగా గేల్ ఈ రకంగా వ్యహరించి వివాదాల్లో చిక్కుకున్నాడు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. ఇక గేల్ ను బిగ్ బాష్ లీగ్లో పాల్గొనకుండా చేయాలని పలువురు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ధ్వజమెత్తారు.
అయితే గేల్ తీరును క్రికెట్ ఆస్ట్రేలియా లైట్గా తీసుకున్నట్టుంది. అటు ఆస్ట్రేలియా మాజీల నుంచి వచ్చిన విమర్శలను పక్కకు పెట్టిన సీఏ.. వచ్చే సీజన్లో బిగ్ బాష్ లీగ్ లో గేల్ ఆడేందుకు ఎటువంటి అభ్యంతరాలూ లేవంటూ తాజాగా స్పష్టం చేసింది. ' బిగ్ బాష్ లీగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఘటనలు ఏమైనా జరిగితే మాత్రమే మా జోక్యం ఉంటుంది. ఆటగాళ్ల నియమాకాల విషయం మాత్రం మాకు సంబంధం లేదు. బిగ్ బాష్ లీగ్ నుంచి తప్పించడం క్రికెట్ ఆస్ట్రేలియా పని కాదు. అందుచేత బిగ్ బాష్లో గేల్ ఆడేందుకు మా నుంచి ఎటువంటి అడ్డంకులు లేవు' అని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటిల్ జేమ్స్ సథర్లేండ్ స్పష్టం చేశారు.
జనవరిలో జరిగిన బిగ్ బాష్ లీగ్ సందర్భంగా హోబార్ట్ హరికేన్స్-మెల్‌బోర్న్ రెనగేడ్స్ మ్యాచ్ అనంతరం మహిళా జర్నలిస్టు పట్ల గేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయన ప్రాతినిధ్యం వహించి మెల్‌బోర్న్ జట్టు విజయం సాధించిన తరువాత టెన్ స్పోర్ట్స్ ప్రజెంటర్ మెలానీ మెక్‌లాఫిలిన్ ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. గేల్ ఇన్నింగ్స్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగింది. గేల్ స్పందిస్తూ 'నువ్వు చేసే ఈ ఇంటర్వ్యూ కోసమే నేను చాలా బాగా బ్యాటింగ్ చేశాను' అని పేర్కొన్నాడు.
'నీ కళ్లు చాలా అందంగా ఉన్నాయి. మ్యాచ్ గెలిచిన తర్వాత మనం కలిసి డ్రింక్స్‌కి వెళ్తామని ఆశిస్తున్నా. మరీ సిగ్గుతో పొంగిపోకు బేబి' అని అన్నాడు. గేల్ వ్యాఖ్యలను బిగ్ బాష్ లీగ్ ఆర్గనైజేషన్ తప్పబట్టింది. అవి అవమానకర వ్యాఖ్యలని పేర్కొంది. దాంతో క్రిస్ గేల్ కు 10 వేల యూఎస్ డాలర్లు జరిమానాగా విధించింది. అప్పట్లో సథర్లేండ్ కూడా గేల్ తీరును తప్పుబట్టాడు. ఆ వ్యాఖ్యలు అసందర్భమే కాకుండా వేధింపులతో సమానమని ఆయన మండిపడ్డారు. కాగా, మూడు నెలల అనంతరం సథర్లేండ్ మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలకు, సీఏకు సంబంధం లేదని పేర్కొనడంతో గేల్ కు లైన్ క్లియరైనట్లే కనబడుతోంది.