
మెల్‌బోర్న్: కేప్‌టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు 9 నెలల నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్ బాన్‌క్రాఫ్ట్ అప్పటి నిర్వాకానికి గల కారణాలు తాజాగా వెల్లడించాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రోద్బలంతోనే బంతి ఆకారం మార్చేందుకు యత్నించామని తెలిపాడు. మాజీ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ‘ట్యాంపరింగ్ చేయమని వార్నర్ సూచించాడు. నేను గుడ్డిగా అతను చెప్పినట్లే చేశాను. అయితే ఇదంతా నా తప్పిదమే. ఈ ఉదంతంలో ఎవరినీ బాధ్యుల్ని చేయాలనుకోవడం లేదు. నేను బాధితుడ్ని కాను. ఇది నా పొరపాటే. నేనే ఇదంతా చేశాను. ఏమాత్రం ముందువెనుక ఆలోచించకుండా పెద్ద తప్పే చేశాను’ అని అన్నాడు. అతనిపై విధించిన 9 నెలల నిషేధం ఈ నెలాఖరుతో ముగియనుంది.
క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఉన్నతాధికారులు సదర్లాండ్, హోవర్డ్‌లు తమ జట్టు ఈ టెస్టులో తప్పక గెలవాల్సిందేనని ఒత్తిడి తేవడం వల్లే బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డామని మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్మిత్, వార్నర్‌లిద్దరూ ఏడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఇంటర్వ్యూలో స్మిత్ మాట్లాడుతూ ‘కేవలం ఆడేందుకు మీకు డబ్బులివ్వట్లేదు. గెలవాలనే ఇస్తున్నాం అని మాతో సదర్లాండ్ చెప్పిన మాటలు ఎలాగైనా... ఏం చేసైనా టెస్టు గెలవాలనే కసిని పెంచాయి. అందుకే బంతి ఆకారం మార్చేందుకు యత్నించాం’ అని స్మిత్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment