బాన్‌క్రాప్ట్
సిడ్నీ : ట్యాంపరింగ్ వివాదంతో క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ప్రపంచ క్రికెట్ ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లను దోషులుగా నిలబెట్టింది. ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనలో చోటుచేసుకున్న ఈ వివాదం ఆస్ట్రేలియా జట్టును కుదిపేసింది. ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లను ఏడాది పాటు ఆటకు దూరం చేయగా.. యువ ఆటగాడు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ను 9 నెలలు దూరం చేసింది. అయితే ఈ ఘటన సూత్రదారి డేవిడ్ వార్నరేనని అప్పట్లో విచారణ జరిపిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) దర్యాప్తు బృందం తేల్చిచెప్పింది. కానీ ఇప్పటి వరకు వార్నర్ పాత్రపై ఈ ఆటగాళ్లు నోరు విప్పలేదు. తాజాగా వార్నర్ ప్రోద్భలంతోనే తాను బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించినట్లు ఈ వివాద పాత్రదారి, యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ తొలిసారి మీడియా వేదికగా అంగీకరించాడు. మరో నాలుగు రోజుల్లో బాన్‌క్రాఫ్ట్ తన నిషేధ కాలాన్ని పూర్తి చేసుకోనున్నాడు. డిసెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న బిగ్ బాష్ టి20 లీగ్‌తో క్రికెట్‌లోకి పునఃప్రవేశం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో మీడియాతో బాన్‌క్రాఫ్ట్ ముచ్చటించాడు.
‘ఆ మ్యాచ్ పరిస్థితుల దృష్ట్యా బంతి ఆకారం దెబ్బతీయమని వార్నర్ నాకు సూచించాడు. అయితే అది మంచి పనా? కాదా? అనే విషయాన్ని గ్రహించలేకపోయాను. ఆ పరిస్థితుల్లో అలా చేయడం సరైందేననిపించింది. కానీ నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన ఈ పని జట్టుపై చాలా ప్రభావం చూపింది.’ అని చెప్పుకొచ్చాడు. తనపై బహిష్కరణ వేటు పడ్డాక తన దృక్పథం పూర్తిగా మారిపోయిందని... ఒక దశలో క్రికెట్ వదిలేసి యోగా టీచర్‌గా మారిపోదామని అనుకున్నానని ఇటీవల బాన్‌క్రాఫ్ట్ తెలిపిన విషయం తెలిసిందే. ఇక స్టీవ్ స్మిత్‌సైతం ట్యాంపరింగ్‌ను అడ్డుకోకపోవడం కెప్టెన్‌గా తన వైఫల్యమేనని ఇటీవల మీడియా ముందు అంగీకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment