
కొత్త హోమ్ గ్రౌండ్ పుణేలో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. సహజంగా ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. పరుగుల ప్రవాహం తప్పదు. అయితే నిజమైన చెన్నై క్రికెట్ ప్రేక్షకులకు ఇది చాలా బాధించే విషయం. తమ అభిమాన క్రికెట్ జట్టు కోసం ఇప్పటికే రెండేళ్లు వేచిచూసిన ఆ అభిమానులకు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ భాగ్యం దక్కడం అత్యంత దురదృష్టకరం! భారత్‌లో ఏదైనా ముందడుగు వేస్తుంటే అడ్డంకులు సృష్టించడంలో, వెనక్కిలాగడంలో మనవాళ్లు సిద్ధహస్తులు. అది ఐపీఎల్ కావొచ్చు... ఇతరత్రా వ్యక్తిగత చాంపియన్‌షిప్ కావొచ్చు... ఇక్కడ ఇదో తంతు! ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు, ఐపీఎల్‌కు ఏమాత్రం సంబంధం లేకపోయినా... రచ్చచేసి మరీ రాష్ట్రం వెలుపలకు తరలించిన ఘనులు వారు. శాంతి భద్రతల సాకుతో ప్రపంచంలోనే టాప్–5లో ఉన్న లీగ్‌ను సొంత ప్రేక్షకులు ఆస్వాదించకుండా చేశారు. అయితే తమ క్రికెట్ హీరోల వీరోచిత పోరాటాన్ని విజ్ఞులైన ప్రేక్షకులను టీవీల్లో చూడకుండా ఆపలేరుగా.
కాబట్టి ప్రత్యక్షంగా కాకపోయినా మనస్ఫూర్తిగా మద్దతిచ్చేందుకు టీవీలకు అతుక్కుపోతారు చెన్నై అభిమానులు. సంబంధంలేని వివాదంతో ఇక్కడి మ్యాచ్‌ల్ని తరలించారు సరే... మరి సినిమాలు, వేడుకలు, పెళ్లిళ్లను ఆపరు.. తరలించరు కదా! ఏదేమైనా ట్రోఫీ మళ్లీ గెలవాలనే చెన్నై జట్టు అంకితభావాన్ని మాత్రం ఎవరు దెబ్బతీయలేరు. గత మ్యాచ్‌లో ధోని ఇన్నింగ్స్‌తోనే ఇది నిరూపితమైంది. వెన్నునొప్పి బాధిస్తున్నా పట్టుదలతో కడదాకా పోరాడాడు ధోని. ఇప్పుడు కావాల్సినంత విరామం దొరకడంతో ఉత్సాహం తో బరిలోకి దిగేం దుకు చెన్నైకి సమ యం కలిసొచ్చింది. చెన్నై అనే కాదు ఏ జట్టుకైనా కొందరు ప్రత్యేక సామర్థ్యం ఉన్న ఆటగాళ్లుంటారు. రాజస్తాన్‌లో బెన్ స్టోక్స్ అలాంటి వాడే. బంతి, బ్యాట్‌తోనే కాదు... సూపర్బ్ క్యాచ్‌లతో మ్యాచ్‌లను మలుపుతిప్పే సమర్థుడు అతడు. బట్లర్ కూడా మేటి ఆటగాడే అయినా స్టోక్స్ అంతగా రంజింపజేయలేడు. సంజూ శామ్సన్ అద్భుతంగా ఆడుతున్నాడు. డివిలియర్స్ (బెంగళూరు)లా మైదానమంతా బంతిని బాదేస్తున్నాడు. చూస్తుంటే నిజంగానే అతను మరో డివిలియర్స్ కాగలడనిపిస్తుంది. సాంకేతికంగానూ మెరుగైతే అతను భారత జట్టులోకి త్వరలోనే తిరిగొస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment