
చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగబోయే మ్యాచ్‌ను గురు శిష్యుల మధ్య పోరుగా భావించవచ్చు. మరో మాటకు తావు లేకుండా ఇక్కడ గురువంటే ధోని అని శిష్యుడు అంటే కోహ్లి అని ఎవరికైనా అర్థం అవుతుంది. ధోని సారథ్యంలో టెస్టులు, వన్డేల్లో అరంగేట్రం చేసిన కోహ్లి అతని నాయకత్వంలోనే గొప్ప ఆటగాడిగా ఎదిగాడు. జట్టు సమావేశాలు అంటే పెద్దగా ఆసక్తి చూపించని ధోని సహచరులు మైదానంలో స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహిస్తాడు. మైదానంలో కూడా శాంతంగా కనిపిస్తూ అతను కెప్టెన్ కూల్ అనిపించుకున్నాడు. ప్రత్యర్థి వికెట్ తీసినప్పుడు కొంత భావోద్వేగంతో కనిపించడం తప్ప ఇతర సందర్భాల్లో అతని ముఖ కవళికల్లో పెద్దగా మార్పుండదు. ఫీల్డింగ్‌లో చురుగ్గా కదలనప్పుడు, త్రో సరిగా విసరనప్పుడు ఫీల్డర్ వైపు కాస్త గుర్రుగా చూస్తాడే తప్ప క్యాచ్ వదిలేసినా, బౌలింగ్ బాగా చేయకపోయినా ఆగ్రహం ప్రదర్శించడు. ఈ విషయమే ఇతర ఆటగాళ్లకు అతనిపై ఉన్న గౌరవాన్ని పెంచుతుంది. లేదంటే మ్యాచ్ ఆసాంతం ఆ ఆటగాడిపై ఒత్తిడి పెరుగుతుంది. పైగా మైదానంలో, టీవీ ప్రేక్షకుల సమక్షంలో అవమానానికి గురి కాకుండా ఉండాలని కోరుకుంటాడు కాబట్టి బాగా ఆడేందుకు మరింతగా శ్రమిస్తాడు. ఒకవేళ డ్రెస్సింగ్ రూమ్‌లో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసినా తాను తప్పు చేశానని తెలుసు కాబట్టి అతను బాధ పడడు.
ఈ విషయంలో ధోనికి కోహ్లి పూర్తిగా వ్యతిరేకం. తన భావోద్వేగాలను ఎన్నడూ దాచుకోకుండా కోహ్లి బయటకు ప్రదర్శిస్తాడు. అతని ఆనందం అయినా నిరాశ అయినా టీవీలో స్పష్టంగా కనిపించేస్తుంటాయి. అయితే ఇప్పుడిప్పుడే కోహ్లి కూడా క్యాచ్ వదిలేసినప్పుడు, మిస్‌ఫీల్డ్ జరిగినప్పుడు కూడా తన కోపం చూపించకుండా ఉండేందుకు చాలా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కెప్టెన్సీలో అనుభవం పెరుగుతున్న కొద్దీ అతను ఈ విషయాలు నేర్చుకుంటున్నాడు. డివిలియర్స్ పుణ్యమా అని గత మ్యాచ్‌లో నెగ్గిన రాయల్ చాలెంజర్స్ ఇదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. అదే విధంగా రెండేళ్ల క్రితం చూపించిన అద్భుత ఫామ్‌ను కోహ్లి మళ్లీ అందుకొని సెంచరీలు బాదాలని కూడా జట్టు కోరుకుంటోంది. మరో వైపు పిచ్‌లన్నీ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో బౌలర్లకు కష్టకాలం ఎదురవుతోంది. చెన్నై ప్రదర్శన చూస్తే వారు రెండేళ్లు ఆటకు దూరమైనట్లుగానే అనిపించడం లేదు. గతంలో ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించిన ప్రధాన ఆటగాళ్లంతా ఇప్పుడు మళ్లీ జట్టుతో ఉండటమే అందుకు కారణమని చెప్పవచ్చు. రెండేళ్ల నిషేధం తర్వాత కూడా చెన్నైతో పాటు దేశమంతటా ఆ జట్టుకు పెద్ద సంఖ్యలో అభిమాన గణం ఉండటం ధోని వల్లే అనడంలో సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment