మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లి (ఫైల్ ఫొటో)
సాక్షి, బెంగళూరు: టీమిండియా మాజీ కెప్టెన్, తాజా కెప్టెన్ల మధ్య పోరును ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా అభిమానులు వీక్షించవచ్చు. ఒకరు మిస్టర్ కూల్ క్రికెటరే కాదు.. కూల్ కెప్టెన్‌గానూ ఫేమస్. మరోవైపు మిస్టర్ అగ్రెసివ్ ప్లేయర్, అగ్రెసివ్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి పేరుంది. వీరిద్దరూ ప్రత్యర్థులుగా మారి నేడు (బుధవారం) బరిలోకి దిగనున్నారు. ఇందుకు బెంగళూరు చిన్నస్వామి స్డేడియం వేదికగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిల మధ్య పోరు అనగానే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు ఇరుజట్ల అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
చిన్నస్వామి స్టేడియం సీట్ల సామర్థ్యం దాదాపు 40 వేలు. కాగా ఆదివారం 25 వేల టికెట్ల అమ్మకాలు చేపట్టగా.. కేవలం గంట వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడుపోవడంతో మ్యాచ్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విరాట్ కోహ్లి టీమిండియాకు కెప్టెన్ అయినప్పటికీ మాజీ కెప్టెన్ ధోని సలహాలతో జట్టును నడిపిస్తున్నాడు. రెండేళ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగిన చెన్నై జట్టు.. ధోని నాయకత్వంలో దూసుకెళ్తోంది. ఐదు మ్యాచ్‌లాడిన చెన్నై నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవగా.. కోహ్లి సారథ్యంలోని బెంగళూరు జట్టు 5 మ్యాచ్‌లాడి 2 విజయాలు మాత్రమే సాధించింది.
చెన్నై జట్టు సొంత మైదానంలో మ్యాచ్‌లను కోల్పోయినా, ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా టికెట్లకు మంచి డిమాండ్ ఉంది. టికెట్ల ధర పెద్ద మొత్తంలో ఉన్నా.. చెన్నై, బెంగళూరు మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయని చిన్నస్వామి స్డేడియం నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు ఐపీఎల్‌లో చెన్నై జట్టుపై అంతగా రికార్డు లేకున్నా సొంత మైదానంలో బరిలో దిగడం బెంగళూరుకు కలిసొచ్చే అంశం. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment