న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్ర దాడి ఘటనకు నిరసనగా నిన్నటి వరకు ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకోవాలన్న డిమాండ్లపై వ్యాఖ్యలు, చర్చలు జరగ్గా... గురువారం ఏకంగా ఆ దేశాన్ని ప్రపంచ కప్ నుంచే తప్పించాలన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఐసీసీకి పంపేందుకు బీసీసీఐ బుధవారమే ముసాయిదా లేఖ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ సూచనతో... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సీఈ డేవ్ రిచర్డ్ సన్, ప్రపంచ కప్ డైరెక్టర్ స్టీవ్ ఎల్‌వర్తిలను ఉద్దేశిస్తూ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి లేఖ రూపొందించారు. దీనిపై శుక్రవారం జరిగే బోర్డు ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి సంబంధిత కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.
బోర్డు సమావేశంలో దేశానికి ఏది మేలనే అంశంపై చర్చిస్తామని సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ ప్రకటించారు. మరోవైపు బోర్డు అధికార వర్గాలు మాత్రం ఇది ఆచరణ సాధ్యం కాదని అంటున్నాయి. ‘ఇలా చేసేందుకు వ్యవస్థా పరంగా, నిర్వహణ పరంగా ఏ విధంగానూ అవకాశాలు లేవు. ఐసీసీ రాజ్యాంగం ప్రకారం... ప్రమాణాల ప్రకారం అర్హత సాధించిన సభ్య దేశాలు ప్రపంచ కప్‌లో పాల్గొనే హక్కుంటుంది. పాక్‌ను నిషేధించాలని మనం కోరితే ఆ డిమాండ్‌ను ఐసీసీ సభ్య దేశాల ముందు ఓటింగ్‌కు పెడుతుంది. ఈ విషయంలో భారత్‌ను వారు సమర్థించరు. అయినా, లేఖ రాయాలంటే ఏప్రిల్‌లో జరిగే బోర్డు వార్షిక సమావేశంలో ప్రతిపాదన చేయాలి. ఇప్పుడు ఐసీసీలో మనకు తగినంత మద్దతు లేదు. బల పరీక్షకు నిలిస్తే మన ప్రతిపాదన వీగిపోతుంది. దీని ప్రభావం 2021 చాంపియన్స్ ట్రోఫీ, 2023 ప్రపంచ కప్ ఆతిథ్యంపైనా పడుతుంది’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఆడి గెలిచి... దెబ్బకొట్టాలి: గావస్కర్
మ్యాచ్‌ను బహిష్కరించి కాకుండా... మైదానంలో గెలిచి పాక్ ప్రపంచకప్ అవకాశాలపై దెబ్బకొట్టాల ని సూచించాడు భారత మాజీ కెప్టెన్ సునీల్ గావ స్కర్. మనం ఆడొద్దనుకుంటే...2 పాయింట్లు పొందడం ద్వారా పరోక్షంగా పాక్ విజయం సాధించినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ‘ప్రజల భావోద్వేగాన్ని అర్థం చేసుకోగలను. అయితే, బహుళ దేశాల టోర్నీలో మ్యాచ్ ఆడకుండా పాయింట్లు కోల్పోవడం సరికాదు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా నేను కట్టుబడి ఉంటా. సరికొత్త పాకిస్తాన్‌ను నిర్మించాలని ఈ సందర్భంగా నా స్నేహితుడు, పాక్ ప్రధాని ఇమ్రా న్‌కు సూచిస్తున్నా’ అని గావస్కర్ పేర్కొన్నారు.
బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ డీకే జైన్
సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు జస్టిస్ ఎస్‌ఏ బాబ్డె, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేలతో కూడిన సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచ్ గురువారం ఉత్తర్వులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment