కెప్టెన్ కూల్.. మిథాలీ రాజ్
డెర్బీ: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సరికొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు సాధించి కొత్త అథ్యాయాన్ని లిఖించింది మిథాలీ. మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన ఆరంభపు మ్యాచ్ లో మిథాలీ ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఇది మిథాలీ ఆన్ ఫీల్డ్ ప్రదర్శన మాత్రమే. అయితే మిథాలీ ఆఫ్ ఫీల్డ్ లో సైతం చూపరులను ఆకర్షించడం ఇక్కడ విశేషం.
ఇంతకీ మిథాలీ ఏం చేసి అలా ఆకర్షించిందో తెలుసా.. కూల్ గా పుస్తకాన్ని చదువుకుంటూ. ఒకవైపు వరల్డ్ కప్. అందులోనే ఇంగ్లండ్ వంటి కఠినమైన ప్రత్యర్థితో జరిగే పోరు. మిథాలీ ఏ మాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టు ఇన్నింగ్స్ ను స్మృతీ మందనా, పూనమ్ రౌత్లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్ కు 144 పరుగులు జోడించి భారత్ కు మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే వీరిలో ఏ ఒక్క వికెట్ పడ్డ ఫస్ట్ డౌన్లో మిథాలీ రావాల్సి ఉంది. కాగా, ప్యాడ్లు కట్టుకుని ఉన్న మిథాలీ మాత్రం పుస్తకాన్ని చదువుతూ కూల్ గా కనిపించింది. దాంతో కెప్టెన్ కూల్ మిథాలీ రాజ్ అంటూ వార్తల్లోకికెక్కింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు 35 పరుగుల తేడాతో గెలిచింది.