ప్రపంచకప్‌ అర్హతే లక్ష్యం | India is ready to fight against England | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ అర్హతే లక్ష్యం

Published Fri, Feb 22 2019 2:25 AM | Last Updated on Fri, Feb 22 2019 2:25 AM

India is ready to fight against England - Sakshi

ముంబై: న్యూజిలాండ్‌లో మిశ్రమ ఫలితాలు సాధించిన భారత్‌ సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వన్డే పోరుకు సిద్ధమైంది. ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే మూడు వన్డేలలో తొలి మ్యాచ్‌ శుక్రవారం ఇక్కడ జరుగుతుంది. భారత మేటి బ్యాట్స్‌మన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ గాయంతో ఈ సిరీస్‌కు దూరమైంది. జట్టుకు వెన్నెముకలాంటి ఆమె కీలకమైన సిరీస్‌కు అందుబాటులో లేకపోవడం భారత్‌కు పెద్ద లోటే! ఈ లోటు కనబడకుండా ఇంగ్లండ్‌పై భారత్‌ ఎలా పైచేయి కనబరుస్తుందో చూడాలి. మిథాలీరాజ్‌ నేతృత్వంలోని భారత్‌ ర్యాంకింగ్‌పైనే కన్నేసింది. 2021 ప్రపంచకప్‌కు టాప్‌–4 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం మూడో ర్యాంకులో ఉన్న టీమిండియా వచ్చే ఏడాది దాకా టాప్‌–4లో నిలవాలనే పట్టుదలతో ఉంది.

ఇటీవలే 200 వన్డేలు పూర్తిచేసుకున్న వెటరన్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ఈ మూడు వన్డేలను గెలవాలనే కసితో ఉంది. బ్యాటింగ్‌ భారాన్ని స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, మిథాలీలు మోయాల్సివుంటుంది. స్మృతి ఇటీవలే ముగిసిన కివీస్‌ పర్యటనలో అసాధారణ ఫామ్‌ను కనబరిచింది. సొంతగడ్డపై కూడా తన టాప్‌ఫామ్‌ను కొనసాగించాలని ఆమె ఆశిస్తోంది. ఓపెనింగ్‌లో ఏ సమస్య లేకపోయినా... జట్టును మిడిలార్డర్‌ బలహీనత వేధిస్తోంది. కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌ దీనిపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. హర్మన్‌ప్రీత్‌ స్థానంలోకి వచ్చిన హర్లీన్‌ డియోల్‌ ఏ మేరకు రాణిస్తుందో ఆయన పరిశీలించనున్నారు. ఇక భారత బౌలింగ్‌ గురించి ఏ బెంగా లేదు. వెటరన్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి, శిఖా పాండే, మాన్సి జోషిలతో పాటు స్పిన్‌కు  అనుకూలించే భారత పిచ్‌లపై దీప్తి శర్మ, ఏక్తా బిష్త్, పూనమ్‌ యాదవ్‌లు రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు.  

అనుభవజ్ఞులతో ఇంగ్లండ్‌ 
మరోవైపు ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో బలమైన ప్రత్యర్థి. అనుభవజ్ఞులైన క్రికెటర్లతో భారత గడ్డపై సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. టాపార్డర్‌లో డానీ వ్యాట్, హీథర్‌ నైట్‌ ఫామ్‌లో ఉన్నారు. బోర్డ్‌ ప్రెసిడెంట్స్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో నైట్‌ అద్భుతంగా ఆడింది. పర్యాటక జట్టుకు ప్రధాన బలం హీథరే. సుదీర్ఘంగా ఇన్నింగ్స్‌ను నడిపించే సామర్థ్యం అమెకు ఉంది. ఆల్‌రౌండర్‌ సోఫీ ఎక్సెల్‌స్టోన్, పేసర్లు అన్య ష్రబ్‌సోల్, నాట్‌ సీవర్‌లతో ఇంగ్లండ్‌ బౌలింగ్‌ దళం కూడా బలంగా ఉంది. వార్మప్‌ మ్యాచ్‌లో ష్రబ్‌సోల్‌ నాలుగు వికెట్లు తీసి సత్తాచాటింది. 

‘‘మాకు ఈ సిరీస్‌ చాలా కీలకం. మూడో ర్యాంకులో ఉన్న మేం దీన్ని ఇలాగే నిలబెట్టుకొని నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించాలనుకుంటున్నాం. కాబట్టి ప్రతీ మ్యాచ్‌ గెలిచేందుకే ప్రయత్నిస్తాం. అయితే ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లండ్‌ ఆషామాషీ జట్టేమీ కాదు. వారిని ఓడించడం అంత సులభం కాదని తెలుసు. పైగా హర్మన్‌ప్రీత్‌ లేకపోవడం మాకు లోటే! సిరీస్‌లో సమష్టిగా రాణించడంపై దృష్టిపెట్టాం. ఈ సిరీస్‌ తర్వాత టి20లకు గుడ్‌బై చెబుతాననే వార్తల్లో నిజం లేదు. సమయం వచ్చినపుడు నేనే ప్రకటిస్తా’’     
మిథాలీ రాజ్, భారత కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement