
ధోనీ సీరియస్ ఎందుకు అయ్యాడు!
బెంగళూరు: తీవ్ర ఒత్తిడిలోనూ జట్టు చాలా కూల్ గా వ్యహరించిందని, అదే విజయానికి దోహదపడుతుందని కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్నాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లోనూ ఎలా ఆడాలనే దానిపై ప్రతి ఒక్కరికీ ఓ అభిప్రాయం ఉంటుందని, బ్యాట్స్మన్ బంతిని ఎలా ఆడతాడన్న దానిపై బౌలర్ కూడా ఓ అభిప్రాయంతో ఉంటాడని పేర్కొన్నాడు. ఆ సమయంలో వికెట్ పరిస్థితులకు తగ్గట్టుగా బౌలర్ బంతులు వేయాలని, బంతి ఎలా స్వింగ్ అవుతుందన్ని విషయాన్ని గమనించాలని అభిప్రాయపడ్డాడు. జట్టు సభ్యులు తగిన సూచనలు ఇచ్చినా వాటన్నింటిని బట్టి చివరికి బౌలర్ తన మైండ్ లో ఏముందో అదే చేస్తాడని ధోనీ చెప్పుకొచ్చాడు.
బంగ్లాదేశ్ పై ఉత్కంఠభరితంగా సాగిన పోరులో గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కాస్త ఆవేశానికి లోనయ్యాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో విలేకరులు అడిగిన ప్రశ్నలు అతడిని అసహనానికి గురిచేశాయి. టీమిండియా విజయం ఎంతమేరకు తృప్తినిచ్చిందంటూ విలేకరులు ధోనీని అడిగారు. దీంతో ఆయన ఆవేశానికి లోనైయ్యాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తికయినా కోపం వస్తుందని అలాంటివి పట్టించుకునే విషయాలు కావని ఆ తర్వాత సమర్థించుకున్నాడు మిస్టర్ కూల్. టీ20 ప్రపంచకప్ లో భాగంగా బుధవారం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేయగా, అనంతరం బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.
బంగ్లాపై గెలిచినందుకు భారత అభిమానులు సంతోషంగా లేరని తనకు తెలుసునన్నాడు. నెట్ రన్ రేట్ పెంచుకుని సెమీస్ ఆశల్ని మెరుగు పరుచుకోవాలని కానీ అలా జరగలేదని పేర్కొన్నాడు. విలేకరులు తనను ప్రశ్నలు అడిగిన తీరు చూస్తే వారు ఈ విజయంపై ఆనందంగా లేరని అర్థమవుతుందని, మ్యాచ్ గురించి మట్లాడేందుకు తన వద్ద స్క్రిప్టు ఉండదని చెప్పుకొచ్చాడు. అయితే టాస్ గెలిచిన బంగ్లా, టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించినప్పుడే ఎక్కువ పరుగులు చేయడం కష్టమని అర్థమయిందని ధోనీ చెప్పాడు. ఈ పిచ్ పై ఎక్కువ స్కోరు చేసే అవకాశాలు లేవని, పరిస్థితులు ఏంటన్నది విశ్లేషించుకోకుండా ప్రశ్నలు అడుగుతున్నారని కాస్త అసహనానికి గురయ్యాడట.