
జోద్‌పూర్ : ‘కాఫీ విత్ కరణ్ షో’ లో చేసిన అనుచిత వ్యాఖ్యల సెగ టీమిండియా యువ క్రికెటర్లు హర్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లను ఇప్పట్లో వదిలేలా లేదు. ఒళ్లు మరిచి మహిళల పట్ల చేసిన అసభ్యకర కామెంట్స్‌కు ఇప్పటికే తగిన మూల్యం చెల్లించుకున్న ఈ యువ క్రికెటర్ల కష్టాల కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పాండ్యా, రాహుల్‌తో పాటు షో నిర్వాహకుడు, కరణ్ జోహర్‌లపై కేసు నమోదైంది. మహిళలను కించపరిచేలా జుగుప్సాకరంగా మాట్లాడిన పాండ్యా, రాహుల్‌తో పాటు షో నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్తాన్ చెందిన డీఆర్ మెఘవాల్ అనే వ్యక్తి జోద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
పాండ్యా, రాహుల్‌ల వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో నిరవధిక నిషేధం విధిస్తూ బీసీసీఐ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరి ఆటగాళ్లను ఆస్ట్రేలియా పర్యటన నుంచి అకస్మాత్తుగా స్వదేశానికి పిలిపించింది. తొలుత క్రికెట్ పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ రెండు మ్యాచ్‌ల నిషేధంతో సరిపెట్టాలని భావించినా, మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ న్యాయ సలహాకు పట్టుబట్టడంతో వీరిద్దరిపై నిరవధిక నిషేధాన్ని విధించారు.
కొన్ని రోజుల నాటకీయ పరిణామాల అనంతరం పాండ్యా, రాహుల్‌లపై సీఓఏ నిషేధాన్ని ఎత్తివేసింది. అనంతరం పాండ్యా న్యూజిలాండ్ పర్యటనలో పాల్గొని చెలరేగగా.. రాహుల్ భారత్-ఏ జట్టు తరపున ఇంగ్లండ్ బ్లూ జట్టుతో ఆడుతున్నాడు. ఈ వివాదంతో తీవ్రంగా కలత చెందిన పాండ్యా తన కసిని మైదానంలో చూపించాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ల్లో అదరగొట్టి ఆల్‌రౌండర్‌గా తన సత్తాను చాటాడు. ఈ నేపథ్యంలో ముగిసిపోయిందనుకున్న ఈ వివాదంపై మళ్లీ కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. ఇది ప్రపంచకప్‌లో పాల్గొనబోయే పాండ్యా ఆటపై ప్రభావం చూపుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment