డికాక్ ధమాకా | Centurion de Kock takes DD home in Bengaluru | Sakshi
Sakshi News home page

డికాక్ ధమాకా

Published Mon, Apr 18 2016 2:53 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

డికాక్ ధమాకా

డికాక్ ధమాకా

గత ఐపీఎల్‌లలో పేలవ ప్రదర్శనకు డీలా పడిపోయిన ఢిల్లీ డేర్‌డెవిల్స్...
ఈ సీజన్‌లో వీరోచిత ప్రదర్శనతో చెలరేగిపోతోంది.
బెంగళూరులాంటి పటిష్టమైన జట్టుపై 192 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా
ఛేదించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
కరుణ్ నాయర్ అండతో డికాక్ సూపర్ సెంచరీతో దుమ్మురేపితే...
అటూ డివిలియర్స్, కోహ్లిల శ్రమ వృథా అయ్యింది.

 
* ఢిల్లీ ఓపెనర్ మెరుపు సెంచరీ    
* బెంగళూరుపై డేర్‌డెవిల్స్ అద్భుత విజయం    
* కోహ్లి, డివిలియర్స్ శ్రమ వృథా

బెంగళూరు: కళ్ల ముందు భారీ లక్ష్యం ఉన్నా... ప్రత్యర్థి జట్టులో అందరూ నాణ్యమైన బౌలర్లున్నా.... ఒంటరిగా ఢీకొట్టిన క్వింటన్ డికాక్ (51 బంతుల్లో 108; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) ఐపీఎల్-9లో వీరోచిత సెంచరీతో రెచ్చిపోయాడు. కరుణ్ నాయర్ (42 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యంతో కొండంత స్కోరును నీళ్లు తాగినంత సులువుగా ఛేదించాడు.

దీంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సంచలన విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి (48 బంతుల్లో 79; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), డివిలియర్స్ (33 బంతుల్లో 55; 9 ఫోర్లు, 1 సిక్స్), వాట్సన్ (19 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) దుమ్మురేపారు. అనంతరం ఢిల్లీ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. డికాక్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
 
గేల్ మళ్లీ విఫలం...
భారీ ఆశలు పెట్టుకున్న క్రిస్ గేల్‌ను ఇన్నింగ్స్ మూడో బంతికే జహీర్ అవుట్ చేసినా.. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ విశ్వరూపం చూపెట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన డివిలియర్స్ కూడా వరుసగా ఫోర్లు బాదడంతో స్కోరు బోర్డు సునామీలా కదిలింది. నాలుగు, ఐదు, ఆరు ఓవర్లలో 44 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లేలో ఆర్‌సీబీ స్కోరు 63/1కు చేరుకుంది. ఈ దశలో స్పిన్నర్లు వచ్చినా.... ఈ జోడిని ఆడ్డుకోలేకపోయారు.

వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడంతో పాటు ఓవర్‌కు ఓ ఫోర్ బాదడంతో తొలి 10 ఓవర్లలో బెంగళూరు 97 పరుగులు చేసింది. ఈ క్రమంలో 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన డివిలియర్స్‌ను 12వ ఓవర్‌లో బ్రాత్‌వైట్ అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 65 బంతుల్లో 107 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన వాట్సన్ మరింత రెచ్చిపోయాడు. భారీ షాట్లతో కోహ్లితో పోటీపడటంతో మూడు ఓవర్ల (14, 15, 16)లోనే 50 పరుగులు సమకూరాయి.

ఈ ఇద్దరి మధ్య మూడో వికెట్‌కు 30 బంతుల్లో 63 పరుగులు జత చేరాయి. అయితే 12 బంతుల తేడాలో వాట్సన్, సర్ఫరాజ్ (1), కోహ్లి అవుట్‌కావడం.... చివరి మూడు ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే రావడంతో ఆర్‌సీబీ స్కోరు రెండొందలు దాటలేదు.
 
అద్భుత భాగస్వామ్యం
లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ ఓపెనర్లలో శ్రేయస్ (0) విఫలమైనా.. రెండో ఎండ్‌లో డికాక్ ధాటిగా ఆడాడు. వరుసగా బౌండరీలు బాదుతూ రన్‌రేట్‌ను పెంచాడు. కానీ ఐదో ఓవర్‌లో శామ్సన్ (9) కూడా అవుట్ కావడంతో ఢిల్లీ 50 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వచ్చినా కరుణ్ నాయర్ జాగ్రత్తగా ఆడాడు. భారీ షాట్లకు పోకుండా డికాక్‌కు మంచి సహకారాన్ని అందించాడు. ఈ ఇద్దరి నిలకడతో ఢిల్లీ 10 ఓవర్లలో 93 పరుగులు చేసింది. ఈ క్రమంలో డికాక్ 22 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు.

14వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 20 పరుగులు రాబట్టగా, ఆ తర్వాతి ఓవర్‌లో మరో 10 పరుగులు సాధించారు. ఇక 30 బంతుల్లో 46 పరుగులు చేయాల్సిన దశలో ఈ ఇద్దరు భారీ షాట్లకు తెరలేపారు. నాయర్ ఓ ఫోర్, సిక్స్ బాదితే, డికాక్ రెండు ఫోర్లతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో నాయర్ 36 బంతుల్లో అర్ధసెంచరీ; డికాక్ 48 బంతుల్లో సెంచరీ పూర్తి చేశారు. ఆ తర్వాత డికాక్ మరో రెండు ఫోర్లు బాది అవుటయ్యాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 12.4 ఓవర్లలో 134 పరుగులు జోడించారు. 12 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన దశలో డుమిని (7 నాటౌట్) ఫోర్ కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు.
 
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (సి) డుమిని (బి) జహీర్ 0; కోహ్లి (సి) అయ్యర్ (బి) షమీ 79; డివిలియర్స్ (సి) షమీ (బి) బ్రాత్‌వైట్ 55; వాట్సన్ (సి) మోరిస్ (బి) షమీ 33; సర్ఫరాజ్ రనౌట్ 1; కేదార్ జాదవ్ నాటౌట్ 9; వీస్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191.
వికెట్ల పతనం: 1-0; 2-107; 3-170; 4-172; 5-177.
బౌలింగ్: జహీర్ 4-0-50-1; మోరిస్ 4-0-29-0; షమీ 4-0-34-2; నేగి 3-0-26-0; మిశ్రా 3-0-26-0; బ్రాత్‌వైట్ 2-0-18-1.
 
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) జాదవ్ (బి) వాట్సన్ 108; శ్రేయస్ అయ్యర్ (సి) వీస్ (బి) అరవింద్ 0; శామ్సన్ (సి) చాహల్ (బి) వాట్సన్ 9; కరుణ్ నాయర్ నాటౌట్ 54; డుమిని నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 192.
వికెట్ల పతనం: 1-11; 2-50; 3-184.
బౌలింగ్: అరవింద్ 3-0-32-1; రసూల్ 3-0-28-0; వాట్సన్ 4-0-25-2; చాహల్ 2.1-0-23-0; వీస్ 4-0-49-0; హర్షల్ పటేల్ 3-0-32-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement