
గెలిపించని సెంచరీ వృథా: రోహిత్
పెర్త్: కొన్నిసార్లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ... జట్టు ఓడిపోయినప్పుడు ఆటగాడికి సంతృప్తి ఉండదని తొలి వన్డేలో సెంచరీ చేసిన రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి మ్యాచ్‌ల్లో చేసిన శతకానికి పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నాడు. ‘సిరీస్‌ను సానుకూల దృక్పథంతో ప్రారంభించడానికి ఓ మంచి ఇన్నింగ్స్ అవసరం. నేను కూడా అదే పని చేశాను.
కానీ చివరకు మ్యాచ్ గెలవకపోవడంతో నిరాశకు గురయ్యా. గెలవనప్పుడు ఎన్ని పరుగులు చేసి ఏం లాభం. వ్యక్తిగతంగా జట్టుకు శుభారంభం ఇచ్చాననే అనుకుంటున్నా. ఇక్కడి నుంచి అదే ఊపును కొనసాగిస్తే బాగుంటుంది’ అని రోహిత్ పేర్కొన్నాడు. మెరుగైన ఆరంభం లభించాక దాన్ని చివరి వరకు బాగా కొనసాగించానని సంతృప్తి వ్యక్తం చేశాడు.