సీవీ మిలింద్, రికీ భుయ్ స్థానాలు పదిలం
ముంబై: అండర్-19 ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత జట్టును సెలక్టర్లు సోమవారం ప్రకటించారు. ఒక మార్పు మినహా ఇటీవల ఆసియా కప్ సొంతం చేసుకున్న జట్టుపైనే నమ్మకముంచిన సెలక్షన్ కమిటీ, దానినే కొనసాగించాలని నిర్ణయించింది. లెఫ్టార్మ్ పేసర్ రిషీ అరోథే స్థానంలో మీడియం పేసర్ అతీత్ సేఠ్‌ను ఎంపిక చేసారు. ఆసియా కప్ గెలిచిన జట్టులో ఉన్న ప్రీతమ్ చక్రవర్తి వరల్డ్ కప్ ప్రారంభమయ్యే సమయానికి వయసు పరిమితి దాటిపోతున్న కారణంగా అతడిని కూడా ఎంపిక చేయలేదు. దుబాయ్‌లో జట్టును విజయ పథంలో నడిపించిన విజయ్ జోల్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఫిబ్రవరి 14నుంచి మార్చి 1 వరకు యూఏఈలో జరిగే ప్రపంచకప్‌లో భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.
జట్టు వివరాలు: విజయ్ జోల్ (కెప్టెన్), అఖిల్ హేర్వాడ్కర్, అంకుశ్ బైన్స్, రికీ భుయ్, సంజు శామ్సన్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్, ఆమిర్ గని, కరణ్ కైలా, సీవీ మిలింద్, అవేశ్ ఖాన్, మోను కుమార్ సింగ్, అతీత్ సేఠ్. కోచ్: భరత్ అరుణ్, అసిస్టెంట్ కోచ్: ఆర్. శ్రీధర్, ఫీల్డింగ్ కోచ్: బిజూ జార్జ్, మేనేజర్: ఆర్.ఐ. పళని.