నేడే ‘ఫైనల్’ | Champions League Twenty20 2013 final at the Ferozeshah Kotla | Sakshi
Sakshi News home page

నేడే ‘ఫైనల్’

Published Sun, Oct 6 2013 12:44 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM

నేడే ‘ఫైనల్’

నేడే ‘ఫైనల్’

 సచిన్ టెండూల్కర్ అభిమానులంతా ఈ రోజు రాత్రి టీవీ సెట్ల ముందు కూర్చోవాల్సిందే. చాంపియన్స్ లీగ్‌తో పరిమిత ఓవర్ల ఆటకు గుడ్‌బై చెబుతున్న మాస్టర్... తన కెరీర్‌లో చివరిసారి రంగుదుస్తుల్లో పోటీ క్రికెట్ ఆడబోతున్నాడు. ట్రినిడాడ్‌తో శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో ముంబై ఇండియన్స్ అలవోకగా నెగ్గి... రాజస్థాన్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఇద్దరు దిగ్గజాల (సచిన్, ద్రవిడ్) చివరి ముఖాముఖి పోరుకు ఢిల్లీ వేదికైంది.
 
 ‘స్టేడియంలో స్క్రీన్ మీద చూసేవరకూ 50 వేల పరుగులకు చేరువయ్యాననే విషయం నాకు తెలియదు. నాకు కొంచెం ‘నమ్మకాలు’ ఎక్కువ. కాబట్టి ఫైనల్ గురించి ఏమీ మాట్లాడను. పొలార్డ్, స్మిత్ మా జట్టులో ఉండటం అదృష్టం’                         
 - సచిన్
 
 న్యూఢిల్లీ: క్లబ్ క్రికెట్‌లో ఐపీఎల్ స్థాయి ఏంటో మరోసారి బయటపడింది. ఆరు దేశాల నుంచి 12 జట్లు పాల్గొన్న చాంపియన్స్ లీగ్‌లో రెండు ఐపీఎల్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఆదివారం జరిగే ఫైనల్లో ద్రవిడ్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమైంది.
 
 ఇదే మైదానంలో శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టుపై గెలిచింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ట్రినిడాడ్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్ లూయిస్ (46 బంతుల్లో 62; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ చేశాడు. యానిక్ ఓట్‌లీ (30 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ ద్వితీయార్థంలో వేగంగా ఆడాడు.
 
 ముంబై ఇండియన్స్ జట్టు 19.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు డ్వేన్ స్మిత్ (38 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సచిన్ టెండూల్కర్ (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 66 బంతుల్లో 90 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. అయితే ట్రినిడాడ్ బౌలర్లు ఆరు పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరితో పాటు రాయుడును కూడా అవుట్ చేసి ముంబైపై ఒత్తిడి పెంచారు. కెప్టెన్ రోహిత్  (22 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (21 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి నాలుగో వికెట్‌కు 42 పరుగులు జోడించి పరిస్థితి చేజారకుండా చూసుకున్నారు.  ట్రినిడాడ్ మిస్టరీ స్పిన్నర్ నరైన్ (3/17) మ్యాజిక్ చేసినా ముంబై గట్టెక్కింది. డ్వేన్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
 
 చాంపియన్స్ లీగ్ ప్రధాన మ్యాచ్‌లు ముంబై, రాజస్థాన్‌ల మ్యాచ్‌తోనే ప్రారంభం అయ్యాయి. మళ్లీ చివరి మ్యాచ్ కూడా ఈ రెండు జట్ల మధ్యే జరగనుండడం కాకతాళీయమే.
 
 స్కోరు వివరాలు
 ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) స్మిత్ (బి) హర్భజన్ 0; ఎవిన్ లూయిస్ (సి) అండ్ (బి) పొలార్డ్ 62; డారెన్ బ్రేవో (స్టం) కార్తీక్ (బి) ఓజా 14; ఓట్‌లీ నాటౌట్ 41; రామ్‌దిన్ (బి) జాన్సన్ 9; పూరన్ (సి) రాయుడు (బి) కౌల్టర్ 15; స్టీవార్ట్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 153 వికెట్ల పతనం: 1-13; 2-61; 3-93; 4-111; 5-148.
 
 బౌలింగ్: జాన్సన్ 3-0-31-1; హర్భజన్ 4-0-35-1; రిషి ధావన్ 3-0-30-0; కౌల్టర్ 4-0-20-1; పొలార్డ్ 3-0-16-1;  ఓజా 3-0-16-1.
 
 ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్:  స్మిత్ (బి) నరైన్ 59; సచిన్ (సి) రామ్‌దిన్ (బి) సిమ్మన్స్ 35; రాయుడు (సి) రామ్‌దిన్ (బి) నరైన్ 0; రోహిత్ (బి) నరైన్ 25; కార్తీక్ నాటౌట్ 33; పొలార్డ్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.1 ఓవర్లలో నాలుగు వికెట్ల కు) 157
 వికెట్ల పతనం: 1-90; 2-91; 3-96; 4-138.
 
 బౌలింగ్: బద్రీ 4-0-25-0; రామ్‌పాల్ 4-0-29-0;  ఓట్‌లీ 3-0-38-0; నరైన్ 4-0-17-3; సిమ్మన్స్ 2.1-0-27-1; స్టీవార్ట్ 2-0-20-0.
 
 మాస్టర్ @ 50,000
 రికార్డుల రారాజు సచిన్ అన్ని ఫార్మాట్‌లు, అన్ని రకాల క్రికెట్‌లలో కలిపి 50 వేల పరుగులు పూర్తి చేశాడు. ట్రినిడాడ్‌తో మ్యాచ్‌లో 26వ పరుగు పూర్తి చేయగానే ఈ ఘనత అందుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ సచిన్. ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో 16వ క్రికెటర్. ఈ విభాగంలో రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ గ్రాహం గూచ్ (67057) పేరిట ఉంది.
 సచిన్ పరుగులు వచ్చాయిలా....
 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ : 307 మ్యాచ్‌ల్లో    -    25228
 లిస్ట్ ఎ క్రికెట్ : 551 మ్యాచ్‌ల్లో      -    21999
 టి20 క్రికెట్ : 95 మ్యాచ్‌ల్లో     -    2782
 మొత్తం: 953 మ్యాచ్‌ల్లో     -    50009

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement