చాంప్స్ రుత్విక, వృశాలి, రాహుల్
డబుల్స్‌లో మెరిసిన కృష్ణ ప్రసాద్-సాత్విక్ సాయిరాజ్ జోడి
జాతీయ జూ॥ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: గౌతమ్ ఠక్కర్ స్మారక అఖిల భారత జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్రీడాకారులు అదరగొట్టారు. మొత్తం ఐదు విభాగాల్లో టైటిల్స్ సాధించారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న గద్దె రుత్విక శివాని, గుమ్మడి వృశాలి, రాహుల్ యాదవ్ సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా అవతరించారు. డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్-సాత్విక్ సాయిరాజ్ జోడి రెండు టైటిల్స్‌ను సొంతం చేసుకుంది.
ముంబైలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో అండర్-19 బాలికల సింగిల్స్ ఫైనల్లో రుత్విక శివాని 21-15, 21-8తో నాలుగో సీడ్ శిఖా గౌతమ్ (కర్ణాటక)ను బోల్తా కొట్టించింది. సెమీఫైనల్లో టాప్ సీడ్ రేష్మా కార్తీక్‌ను ఓడించిన రుత్విక ఫైనల్లోనూ తన జోరు కొనసాగించింది. తొలి గేమ్‌లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నా... రెండో గేమ్‌లో రుత్విక స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది.
అండర్-17 బాలికల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ వృశాలి 21-18, 21-17తో టాప్ సీడ్ శ్రేయాన్షి పరదేశి (ఎయిరిండియా)పై సంచలన విజయం సాధించింది. 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వృశాలి కీలకదశలో పాయింట్లు నెగ్గి మ్యాచ్ ఫలితాన్ని శాసించింది.
అండర్-17 బాలుర సింగిల్స్ ఫైనల్లో రాహుల్ యాదవ్ 21-13, 21-6తో హైదరాబాద్‌కే చెందిన ఎం.కనిష్క్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. తొలి గేమ్‌లో కాస్త పోటీనిచ్చిన కనిష్క్... రెండో గేమ్‌లో మాత్రం రాహుల్ ధాటికి ఎదురునిలువలేదు.
అండర్-17 బాలుర డబుల్స్ ఫైనల్లో కృష్ణ ప్రసాద్-సాత్విక్ సాయిరాజ్ ద్వయం 21-18, 13-21, 21-16తో కార్తికేయ్ గుల్షన్ కుమార్ (ఢిల్లీ)-బోధిత్ జోషి (ఉత్తరాఖాండ్) జంటను ఓడించింది. అండర్-19 డబుల్స్ ఫైనల్లో కృష్ణ ప్రసాద్-సాత్విక్ జోడి 22-20, 22-20తో విఘ్నేశ్ (మహారాష్ట్ర)-గంగాధర రావు (ఆంధ్రప్రదేశ్) జంటపై గెలిచింది.
అండర్-19 మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్ (హైదరాబాద్)-అహల్య హర్జానీ (మహారాష్ట్ర) ద్వయం 18-21, 29-27, 19-21తో విఘ్నేశ్-వైష్ణవి అయ్యర్ (మహారాష్ట్ర) జోడి చేతిలో ఓడిపోయింది. అండర్-19 బాలికల డబుల్స్ ఫైనల్లో సుధా కల్యాణి-రియా ముఖర్జీ జంట 19-21, 18-21తో మహిమ అగర్వాల్-శిఖా గౌతమ్ (కర్ణాటక) ద్వయం చేతిలో ఓటమి పాలైంది.