చాంప్స్ చైనా, ఇండోనేసియా
రెండు విభాగాల్లోనూ జపాన్‌కు నిరాశ ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో చైనా... పురుషుల విభాగంలో ఇండోనేసియా విజేతలుగా నిలిచాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ముగిసిన ఈ ఈవెంట్‌లో మహిళల ఫైనల్లో చైనా 3-2తో జపాన్‌పై... పురుషుల ఫైనల్లో ఇండోనేసియా 3-2తో జపాన్‌పై విజయం సాధించాయి. పురుషుల విభాగంలో సెమీస్‌లో ఓడిన భారత్‌కు కాంస్యం లభిం చింది. భారత మహిళల జట్టు మాత్రం క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించింది.
జపాన్‌తో జరిగిన ఫైనల్లో చైనా మహిళల జట్టు అనూహ్యంగా పుంజుకుంది. తొలి మ్యాచ్‌లో షిజి యాన్ వాంగ్ 21-17, 16-21, 15-21తో నొజోమి ఒకుహారా చేతిలో ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో యింగ్ లు-కింగ్ తియాన్ జోడీ 12-21, 16-21తో మిసాకి మత్సుతోమో-అయాకా తకహాషి జంట చేతిలో పరాజయం పాలైంది. దాంతో చైనా 0-2తో వెనుకబడింది. అయితే ఆ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో చైనా క్రీడాకారిణులు అద్వితీయ ఆటతీరుతో జపాన్ ఆశలను వమ్ము చేశారు. మూడో మ్యాచ్‌లో సున్ యు 22-20, 21-19తో సయాకా సాటోపై గెలుపొం దగా... నాలుగో మ్యాచ్‌లో యు లు-యువాన్‌టింగ్ టాంగ్ జంట 21-11, 21-10తో నోకో ఫకుమాన్-కురిమి ద్వయంపై నెగ్గింది. దాంతో స్కోరు 2-2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో హీ బింగ్‌జియావో 21-18, 21-12తో యు హాషిమోటోను ఓడించడంతో చైనా 3-2తో విజయాన్ని ఖాయం చేసుకొని టైటిల్‌ను సొంతం చేసుకుంది.
పురుషుల విభాగం ఫైనల్ తొలి మ్యాచ్‌లో కెంటో మోమోటా 21-17, 21-7తో మౌలానా ముస్తఫాను ఓడించి జపాన్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. రెండో మ్యాచ్‌లో అంగా ప్రతమ-రికీ సువార్ది ద్వయం 22-20, 14-21, 21-17తో హిరోయుకి ఎండో-కెనిచి హయకావా జోడీపై గెలువడంతో స్కోరు 1-1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో జిన్‌టింగ్ ఆంథోనీ 21-7, 21-16తో షో ససాకిపై నెగ్గడంతో ఇండోనేసియా 2-1తో ముందంజ వేసింది. నాలుగో మ్యాచ్‌లో తకెషి కముర-కీగో సొనోడా జంట 21-16, 21-15తో బెరీ అంగ్రియవాన్-రియాన్ సపుత్ర జోడీని ఓడించడంతో స్కోరు 2-2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో క్రిస్టీ జొనాథన్ 14-21, 21-19, 21-13తో కెంటా నిషిమోటోపై నెగ్గడంతో ఇండోనేసియా 3-2తో విజయం సాధించి విజేతగా నిలిచింది.