భారత అండర్-19 జట్టు నుంచి చందన్ సహాని ఔట్
వయస్సు పైబడిన ఏడుగురు క్రికెటర్లపై బీసీసీఐ వేటు
ముంబై: ఆసియా కప్ కోసం లోగడ ఎంపిక చేసిన భారత అండర్-19 జట్టు నుంచి హైదరాబాద్ క్రికెటర్ చందన్ సహానిని తప్పించారు. వయస్సు పైబడటంతో ఇతనితో పాటు మొత్తం ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేశారు. దిగ్విజయ్ రంగీ, డారిల్ ఫెర్రారియో, సందీప్ తోమర్, రిషబ్ భగత్, సిమర్జిత్ సింగ్, ఇజాన్ సయ్యద్‌లను తప్పించి కొత్తగా హిమాన్షు రాణా, సల్మాన్ ఖాన్, హర్విక్ దేశాయ్, యశ్ ఠాకూర్, హెరాంబ్ పరాబ్, వివేకానంద్ తివారి, హేత్ పటేల్‌లను భారత జూనియర్ జట్టుకు ఎంపిక చేశారు.
తప్పించిన ఆ ఏడుగురు క్రికెటర్లు నవంబర్ 1998కు ముందు జన్మించారు. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అనర్హులనీ తేల్చి వయస్సు నిబంధనలపై బీసీసీఐకి స్పష్టతనిచ్చింది. ఇందులో ఎవరికైతే వచ్చే అండర్-19 ప్రపంచకప్ (న్యూజిలాండ్) నాటికి 19 ఏళ్లలోపు వయస్సుంటుందో వారే అర్హులని తెలిపింది. దీంతో కొత్తగా అర్హులైన ఏడుగురు ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఆసియా కప్ అండర్-19 టోర్నీ ఈ నెల 15 నుంచి 23 వరకు శ్రీలంకలో జరుగుతుంది.