
నా మద్దతు మీకే... లయన్ ఫ్యాన్ ఉత్సాహం
విశాఖ స్పోర్ట్స్ :అనుకోని వరంతో పరవశించిన విశాఖ ఆనందోత్సాహాల తరంగమే అయింది. మండే ఎండాకాలంలో మురిపించిన విరివానలా వచ్చిన ఐపీఎల్ సంరంభం పులకింపజేస్తే.. ఆ జల్లుల్లో నిలువెల్లా తడిసి తన్మయంతో ఆడిపాడింది. టోర్నీమెంట్ రెండో క్వాలిఫయర్‌లో ఎదురులేని చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను నిండు గుండెతో స్వాగతించింది. ధోనీ అంటే తరగని మక్కువ గల వైజాగ్ క్రీడాభిమాన గణం ఆ అభిమానం ఏ సందర్భంలోనైనా తరగని గని వంటిదని నిరూపించింది. ప్రేక్షకాదరణను దండిగా పొందిన ధోనీ సేన ఆడుతూ పాడుతూ ఐపీఎల్ ఫైనల్‌కు చేరిన తరుణాన్ని విశాఖ ఓ పండగలా ఎంజాయ్ చేసింది.
ఎలిమినేటర్‌లో మాదిరిగా వైఎస్సార్ స్టేడియంలో ఉత్సాహం, ఉల్లాసం జతకట్టి కేరింతలు కొడితే.. ఆటలో ఆనందాన్ని మించి ఐపీఎల్ మజాను విశాఖ ఆస్వాదించింది. బుధవారం నాటి మ్యాచ్‌లో దూసుకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు క్వాలిఫయిర్‌లో తేలిపోవడంతో.. సెమీ ఫైనల్ వంటి కీలక మ్యాచ్ ఏకపక్షమే అయింది. చెన్నై సింహం జూలు విదిల్చి మ్యాచ్‌ను ఎగరేసుకుపోయిన వైనాన్ని పక్కన పెడితే.. శుక్రవారం రాత్రి సందడిగా సాగింది. నెరవేరని ఆశతో ఢిల్లీ నిరాశ పడినా.. సముచితమైన జట్టే తుదిపోరుకు తరలుతోందన్న సంతృప్తితో విశాఖ వీరాభిమానుల దండు ఇళ్లకు మరలింది. కీలకమైన ప్లే ఆఫ్‌ను అద్భుతంగా నిర్వహించి విశాఖ అందరి హృదయాలనూ చూరగొంది. ముఖ్యంగా సీఎస్కే సారథి ధోనీ మనసును మరోసారి సాగర నగరి గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment