చెన్నై సూపర్ కింగ్స్కు చుక్కెదురు
చెన్నై: నిషేధానికి గురైన ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. చెన్నై జట్టుకు ఐపీఎల్ లీగ్ నుంచి రెండేళ్ల నిషేధంపై స్టే ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు నియమించిన జస్టీస్ లోథా కమిటీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 23కు ఈ కేసును వాయిదా వేశారు. చీఫ్ జస్టిస్ సంజయ్ విషన్ కౌల్, జస్టిస్ టీఎస్ శివంగ్నానమ్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ కేసును వాయిదా వేస్తూ తీర్పు వెల్లడించారు. బీసీసీఐ నిర్ణయం వెలువడిన తర్వాత ఈ జట్ల నిషేధంపై తీర్పు వెల్లడించడానికి వీలుంటుంది.
ఆగస్టు 28న బీసీసీఐ అధికారులు ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన జట్లపై ఓ నిర్ణయాన్ని తీసుకునేందుకు సమావేశం కానున్నారు. సమావేశం ముగిసిన తర్వాత బీసీసీఐ వెల్లడించే నిర్ణయాన్ని బట్టి ఆ జట్లపై తుది నిర్ణయాన్ని తీసుకుని లీగ్ సభ్యులకు సూచనలిస్తారు. అవసరమైతే రెండు కొత్త జట్ల కోసం టెండర్ వేసే అవకాశాలు లేకపోలేదు. ఐపీఎల్-6 సీజన్లో ఆ జట్ల యజమానులు గురునాథ్ మేయప్పన్, రాజ్ కుంద్రాలు ఫిక్సింగ్ చేశారన్న ఆరోపణలతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను రెండేళ్ల పాటు ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు ఆడకూడదని నిషేధించిన విషయం విదితమే.