ముంబై ఇంటికి... | Chennai Super Kings won match against mumbai indians | Sakshi
Sakshi News home page

ముంబై ఇంటికి...

Published Thu, May 29 2014 12:55 AM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM

ముంబై ఇంటికి... - Sakshi

ముంబై ఇంటికి...

ఎలిమినేటర్‌లో చెన్నై చేతిలో చిత్తు   
 క్వాలిఫయర్-2కు దూసుకెళ్లిన ధోనీసేన
 
 ముంబై: ఎవరూ ఊహించని రీతిలో రాజస్థాన్‌ను చిత్తుచేసిన ముంబైని చెన్నై జట్టు నేలకు దించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ధోనిసేన అద్భుతమైన బ్యాటింగ్‌తో ముంబైని ఇంటికి పంపించింది. బ్రబౌర్న్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో  చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది.
 
 టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్లు సిమ్మన్స్ (44 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), మైక్ హస్సీ (33 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. చెన్నై బౌలర్లలో మోహిత్ శర్మ (3/42) మూడు వికెట్లు పడగొట్టగా, ఆశిష్ నెహ్రా, జడేజా రెండేసి వికెట్ల చొప్పున తీశారు.
 
 అనంతరం  చెన్నై 18.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 176 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రైనా (33 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ హస్సీ (29 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు)లు రాణించారు. ముంబై బౌలర్లలో హర్భజన్‌కు రెండు, ఓజాకు ఒక వికెట్ దక్కాయి.
 
 స్లాగ్ ఓవర్లలో తడబాటు:  ముంబైకి సిమ్మన్స్-మైక్ హస్సీ జోడి శుభారంభాన్నిచ్చారు. దీంతో పవర్‌ప్లేలో  53 పరుగులు లభించాయి.  స్పిన్నర్లు అశ్విన్, జడేజాల ప్రవేశంతో ముంబై వేగానికి బ్రేకులు పడ్డాయి.
 
  ఈ క్రమంలో జడేజా బౌలింగ్‌లో 10వ ఓవర్లో హస్సీ ఔటయ్యాక.. అండర్సన్ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు) వచ్చీ రావడంతోనే చెలరేగినా... అశ్విన్‌కు వికెట్ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్ శర్మ సహకారంతో దూకుడు పెంచిన సిమ్మన్స్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్‌కు 27 బంతుల్లో 44 పరుగులు జత చేశాక  సిమ్మన్స్.. లాంగాన్‌లో రైనా చేతికి చిక్కాడు. ఇక్కడి నుంచి స్కోరు వేగం పెంచేప్రయత్నంలో రోహిత్ (16 బంతుల్లో 20), పొలార్డ్ (8 బంతుల్లో 14)లతో సహా బ్యాట్స్‌మెన్ వరుసగా డగౌట్‌కు క్యూ కట్టారు. ఒక దశలో 16 ఓవర్లలో 140/2 స్కోరుతో ఉన్న ముంబై.. నాలుగు ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి చతికిలబడింది. చివరి రెండు ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోవడంతో ఆశించిన స్కోరు రాలేదు.


 రైనా దూకుడు: లక్ష్యఛేదనలో చెన్నై ఆరంభం నుంచే ముంబైపై ఆధిపత్యం ప్రదర్శించింది. డ్వేన్ స్మిత్ (20), డుప్లెసిస్ (35) చెలరేగడంతో  పవర్ ప్లేలో 60 పరుగులు లభించాయి. అయితే హర్భజన్ ఒకే ఓవర్లో వీరిద్దరినీ ఔట్ చేసి ముంబై శిబిరంలో ఉత్సాహం నింపాడు. మరికొద్ది సేపటికే  మెకల్లమ్ (14) ఓజా బౌలింగ్‌లో స్టంపవుటయ్యాడు.
 
  కానీ ఆ తరువాత రైనా, డేవిడ్ హస్సీలు ముంబైకి మరో అవకాశమే ఇవ్వలేదు. ముఖ్యంగా రైనా అద్భుతంగా ఆడాడు. 36 బంతుల్లో 56 పరుగులు చేయాల్సిన దశలో ప్రవీణ్ వేసిన 15వ ఓవర్లో 14, ఓజా వేసిన 16వ ఓవర్లో 20 పరుగులు సాధించిన ఈ ఇద్దరూ లక్ష్యాన్ని తేలిక చేశారు. అజేయమైన నాలుగో వికెట్‌కు 89 పరుగులు జోడించి మరో 8 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించారు.
 
 స్కోరు వివరాలు
 ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) రైనా (బి) జడేజా 67; మైక్ హస్సీ (బి) జడేజా 39; అండర్సన్ (సి) పాండే (బి) అశ్విన్ 20; రోహిత్ (సి) మెకల్లమ్ (బి) మోహిత్ 20; పొలార్డ్ (సి) మోహిత్ (బి) నెహ్రా 14; రాయుడు (సి) డేవిడ్ హస్సీ (బి) మోహిత్ 2; తారే (సి) డుప్లెసిస్ (బి) నెహ్రా 0; హర్భజన్ (నాటౌట్) 7; ప్రవీణ్ (బి) మోహిత్ 1; ఓజా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173.
 
 వికెట్ల పతనం: 1-76; 2-99; 3-143; 4-150; 5-163; 6-164; 7-164; 8-166.
 బౌలింగ్: నెహ్రా 4-0-34-2; పాండే 3-0-25-0; మోహిత్ 4-0-42-3; అశ్విన్ 4-0-26-1; జడేజా 4-0-31-2; రైనా 1-0-13-0.
 
 చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 24; డుప్లెసిస్ (సి) సబ్‌స్టిట్యూట్- డంక్ (బి) హర్భజన్ 35; రైనా (నాటౌట్) 54; మెకల్లమ్ (స్టంప్డ్) తారే (బి) ఓజా 14; డేవిడ్ హస్సీ (నాటౌట్) 40; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 176.
 వికెట్ల పతనం: 1-60; 2-64; 3-87.
 
 బౌలింగ్: ప్రవీణ్ 4-0-27-0; అండర్సన్ 3-0-35-0; బుమ్రా 3.4-0-40-0; హర్భజన్ 4-0-27-2; ఓజా 3-0-34-1; పొలార్డ్ 1-0-10-0.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement