చైనాపై తొలిసారి... | China for the first time ... | Sakshi
Sakshi News home page

చైనాపై తొలిసారి...

Published Fri, Feb 19 2016 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

చైనాపై తొలిసారి...

చైనాపై తొలిసారి...

టీమ్ ఈవెంట్‌లో
భారత్ పురుషుల జట్టు విజయం
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
 జపాన్ చేతిలో ఓడిన మహిళల జట్టు


సాక్షి, హైదరాబాద్: ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు చెలరేగింది. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం భారత్ 3-2 తేడాతో చైనాను ఓడించింది. మూడు సింగిల్స్ మ్యాచ్‌లలోనూ భారత్ నెగ్గగా...రెండు డబుల్స్ మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. అంతర్జాతీయ స్థాయిలో ఏ టోర్నీలో అయినా టీమ్ ఈవెంట్‌లో భారత్... చైనాపై విజయం సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

 శ్రీకాంత్ జోరు
వరల్డ్ నంబర్ 8 టియాన్ హోవీ, తొమ్మిదో ర్యాంకర్ శ్రీకాంత్‌ల మధ్య జరిగిన తొలి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో శ్రీకాంత్ ఆద్యంతం ఆధిపత్యం కనబర్చాడు. సింగపూర్‌తో గత మ్యాచ్‌లో తడబడిన హైదరాబాద్ ఆటగాడు ఈ సారి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 33 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు శ్రీకాంత్ 21-11, 21-17తో విజేతగా నిలిచాడు. అనంతరం తొలి డబుల్స్‌లో చైనా జోడి జున్‌హుయ్ లి-జిహాన్ క్యు 22-20, 21-11తో భారత ద్వయం మను అత్రి-సుమీత్ రెడ్డిని ఓడించింది. ఆ తర్వాత గంట పాటు జరిగిన హోరాహోరీ పోరులో అజయ్ జైరాం 22-20, 15-21, 21-18తో జెంగ్‌మింగ్ వాంగ్‌పై గెలుపొందాడు. మళ్లీ డబుల్స్‌లో యిల్ వాంగ్-వెన్ జాంగ్ 21-10, 21-18తో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్‌పై గెలుపొందడంతో స్కోరు 2-2తో సమమైంది. ఈ దశలో కీలక సింగిల్స్ ఆడిన హెచ్‌ఎస్ ప్రణయ్ ఒత్తిడికి లోను కాకుండా 21-14, 21-10తో యుఖీ షిని చిత్తు చేయడంతో భారత జట్టు గెలుపు ఖాయమైంది.


మహిళల జట్టు చిత్తు
మరో వైపు మహిళల జట్టుకు మాత్రం జపాన్ చేతిలో పరాజయం ఎదురైంది. జపాన్ 5-0తో భారత్‌ను ఓడించింది. తొలి సింగిల్స్‌లో ప్రపంచ 8వ ర్యాంకర్ నొజొమి ఒకుహరా 18-21, 21-12, 21-12తో సింధుపై గెలుపొందింది. తొలి గేమ్‌ను గెలుచుకున్నా...సింధు ఆ తర్వాత ఏమాత్రం పోరాడలేకపోయింది. తర్వాత మహిళల సింగిల్స్‌లో సయాకా సటో 24-22, 21-14తో పీసీ తులసిపై, యు హషిమొటో 23-25, 21-14, 21-14తో రుత్విక శివానిపై గెలుపొందారు. మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడి 12-21, 18-21తో మిసాకి మట్సుటొమో-అయాకా టకహషి చేతిలో పరాజయం పాలు కాగా... ఆఖరి మ్యాచ్‌లో షిజుక మట్సువో-మామి నైటో 18-21, 21-11, 21-16తో సింధు-సిక్కిరెడ్డి ద్వయాన్ని ఓడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement