'అలీ కోసం టైటిల్ గెలవాలనుకున్నా'
బీజింగ్: తనకు ఎంతో స్ఫూర్తిదాయకమైన బాక్సింగ్ యోధుడు మహ్మద్ అలీ కోసం ప్రొఫెషనల్ బాక్సింగ్ టైటిల్ను గెలుస్తానని చైనా బాక్సర్, రెండు సార్లు ఒలింపిక్ చాంపియన్ జో షిమింగ్ స్పష్టం చేశాడు. తాను ప్రొఫెషనల్ బౌట్లో గెలిచిన తరువాత మహ్మద్ అలీని కలవాలని ముందుగా అనుకున్నానని, అయితే విధి వక్రించడంతో తన కోరిక తీరకుండానే మహ్మద్ అలీ లోకాన్ని విడిచివెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మహ్మద్ అలీ కోసం టైటిల్ గెలుస్తానన్న తన ముందస్తు సంకల్ప ఏదైతే ఉందో, దానిని సాధించి ఆ యోధుడికి ఘనమైన నివాళి అర్పిస్తానని షిమింగ్ పేర్కొన్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్లో మహ్మద్ అలీ మృతిపట్ల షిమింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.
'నా బాక్సింగ్ కెరీర్కు మహ్మద్ అలీనే ఆదర్శం. అతను సాధించిన విజయాలు నాలో స్ఫూర్తిని రగిలించాయి. అలీ కోసం ప్రొఫెషనల్ టైటిల్ గెలవాలనుకున్నా. అయితే అతను ఇక లేడు. మనల్ని విడిచి అనంతలోకాలకు వెళ్లిపోయిన అలీ అత్మకు శాంతి చేకూరాలని మాత్రమే కోరుగలను. అతని కోసం టైటిల్ గెలిచి ఘనమైన నివాళి అర్పించడమే నా ముందున్న లక్ష్యం' అని షిమింగ్ తెలిపాడు. తన కెరీర్లో ఎందరో యోధులను మట్టికరిపించిన అలీ మృత్యువుతో పోరాడుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. శ్వాసకోస సంబంధిత సమస్యతో ఫినిక్స్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అలీ కన్నుమూశారు.
20వ శతాబ్దంలో టాప్ స్పోర్ట్స్ మన్గా అలీ గుర్తింపు తెచ్చుకున్నారు. బాక్సింగ్ ప్రపంచాన్ని ఎదురులేకుండా ఏలారు. అభిమానులు 'ది గ్రేటెస్ట్'గా పిలుచుకునే అలీ 1981లో రిటైరయ్యారు. రికార్డు స్థాయిలో 56 విజయాలు, కేవలం ఐదు పరాజయాలతో కెరీర్ ముగించారు. మూడుసార్లు హెవీవెయిట్ టైటిల్ను మూడుసార్లు సాధించారు. అలీ నాలుగు వివాహాలు చేసుకున్నారు. మొత్తం తొమ్మిదిమంది సంతానం. అలీ కూతురు లైలా తండ్రి అడుగుజాడల్లో నడిచి బాక్సింగ్ను కెరీర్గా ఎంచుకుంది.
1942 జనవరి 17న కెంటకీలోని లూయిస్విల్లేలో అలీ జన్మించారు. 12 ఏళ్లకే బాక్సింగ్ను కెరీర్గా ఎంచుకున్న ఆయన 22 ఏళ్లకే ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ అయ్యారు. 1960ల్లో ఆయన బాక్సింగ్ ప్రపంచాన్ని శాసించారు. కాగా వియత్నాంపై అమెరికా యుద్ధానికి నిరసనగా ఇస్లాం మతం స్వీకరించారు. అలీ మూడు దశాబ్దాలుగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. కెంటకీలోని లూయిస్విల్లేలో అలీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.