
సిడ్నీ: విధ్వంసకర ఆటతో వినోదం పంచడమే కాకుండా పలు మార్లు వివాదాలతో కూడా సహవాసం చేసే విండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు ఊరటనిచ్చే తీర్పును ఆస్ట్రేలియా కోర్టు వెలువరించింది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ ‘ఫెయిర్‌ఫ్యాక్స్ మీడియా’పై వేసిన పరువు నష్టం దావాలో గేల్‌కు 3 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. కోటీ 55 లక్షలు) చెల్లించాలని న్యూసౌత్‌వేల్స్ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఉద్దేశపూర్వకంగా కథనం రాసిన ‘ఫెయిర్‌ఫ్యాక్స్ సంస్థ తమ వాదనను నిరూపించుకోలేకపోయిందని కోర్టు గత ఏడాది అక్టోబరులోనే అభిప్రాయపడి గేల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని ఖరారు చేసింది.
వివరాల్లోకెళితే... 2016లో ఫెయిర్‌ఫ్యాక్స్ మీడియాకు చెందిన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ది ఏజ్ పత్రికలు వరుసగా గేల్‌పై వ్యతిరేక కథనాలు ప్రచురించాయి. ఇందులో భాగంగా 2015 వన్డే వరల్డ్ కప్ సమయంలో సిడ్నీలో జరిగిన ఒక ఘటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాయి. తమ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన ఒక మహిళా మసాయర్ (మసాజ్ థెరపిస్ట్) ముందు గేల్ నగ్నంగా నిలబడి కావాలనే తన శరీరాన్ని ఆమెకు ప్రదర్శించాడని పత్రిక ఆరోపించింది. అయితే దీనిని తీవ్రంగా ఖండించిన గేల్ కోర్టులో పరువు నష్టం కేసు వేశాడు. తాజా తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని ఫెయిర్‌ఫ్యాక్స్ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment