Fairfax Media
-
మళ్లీ గెలిచిన గేల్
సిడ్నీ: వెస్టిండీస్ క్రికెట్ స్టార్ క్రిస్ గేల్ న్యాయపోరాటంలో మరోసారి గెలిచాడు. పరువు నష్టం కేసులో గేల్‌కు అనుకూలంగా వచ్చిన తీర్పును సవాల్ చేసిన ఫెయిర్ ఫ్యాక్స్ మీడియాకు కోర్టులో చుక్కెదురైంది. గేల్‌కు 3 లక్షల ఆస్ట్రేలియా డాలర్లు (సుమారు రూ. కోటీ 45 లక్షలు) పరిహారంగా చెల్లించాల్సిందేనని తాజాగా న్యూసౌత్‌వేల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే పరిహారాన్ని మరింత పెంచాలంటూ గేల్ చేసిన మరో అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. 2015 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా ఒక మహిళతో గేల్ అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమె ముందు నగ్నంగా నిలబడ్డాడని గేల్‌పై 2016లో పత్రికలో వరుస కథనాలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొట్టిపారేసిన గేల్ కోర్టును ఆశ్రయించాడు. తనకు చెడ్డపేరు తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కథనాలు ప్రచురించారని, అలాంటి ఘటన ఏదీ జరగలేదని అతను వాదించాడు. ఫెయిర్ ఫ్యాక్స్ తన వార్తలకు సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో కోర్టు గేల్‌కు అనుకూలంగా తీర్పునిస్తూ అతనికి పరిహారం చెల్లించాలని మీడియా సంస్థను ఆదేశించింది. -
గేల్‌కు 3 లక్షల డాలర్లు చెల్లించండి
సిడ్నీ: విధ్వంసకర ఆటతో వినోదం పంచడమే కాకుండా పలు మార్లు వివాదాలతో కూడా సహవాసం చేసే విండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు ఊరటనిచ్చే తీర్పును ఆస్ట్రేలియా కోర్టు వెలువరించింది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ ‘ఫెయిర్‌ఫ్యాక్స్ మీడియా’పై వేసిన పరువు నష్టం దావాలో గేల్‌కు 3 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. కోటీ 55 లక్షలు) చెల్లించాలని న్యూసౌత్‌వేల్స్ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఉద్దేశపూర్వకంగా కథనం రాసిన ‘ఫెయిర్‌ఫ్యాక్స్ సంస్థ తమ వాదనను నిరూపించుకోలేకపోయిందని కోర్టు గత ఏడాది అక్టోబరులోనే అభిప్రాయపడి గేల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని ఖరారు చేసింది. వివరాల్లోకెళితే... 2016లో ఫెయిర్‌ఫ్యాక్స్ మీడియాకు చెందిన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ది ఏజ్ పత్రికలు వరుసగా గేల్‌పై వ్యతిరేక కథనాలు ప్రచురించాయి. ఇందులో భాగంగా 2015 వన్డే వరల్డ్ కప్ సమయంలో సిడ్నీలో జరిగిన ఒక ఘటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాయి. తమ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన ఒక మహిళా మసాయర్ (మసాజ్ థెరపిస్ట్) ముందు గేల్ నగ్నంగా నిలబడి కావాలనే తన శరీరాన్ని ఆమెకు ప్రదర్శించాడని పత్రిక ఆరోపించింది. అయితే దీనిని తీవ్రంగా ఖండించిన గేల్ కోర్టులో పరువు నష్టం కేసు వేశాడు. తాజా తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని ఫెయిర్‌ఫ్యాక్స్ నిర్ణయించింది. -
ఆ మీడియా సంస్థపై పరువునష్టం వేస్తా: గేల్
మెల్బోర్న్: అసభ్య వ్యాఖ్యలు, లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్.. ప్రముఖ ఆస్ట్రేలియా మీడియా సంస్థ ఫెయిర్‌ఫాక్స్‌పై పరువునష్టం దావా వేయాలని భావిస్తున్నారు. గత ఏడాది వరల్డ్ కప్ సందర్భంగా సిడ్నీలో ఆస్ట్రేలియా మహిళతో క్రిస్ గేల్ అసభ్యకరంగా వ్యవహరించాడని ఫెయిర్‌ఫాక్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఫెయిర్‌ఫాక్స్‌పై దావా వేసేందుకు ఆయన ఓ ప్రముఖ ఆస్ట్రేలియన్ లాయర్ సేవలను కోరారు. బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనగేడ్స్ జట్టు తరఫున ఆడుతున్న క్రిస్ గేల్ ట్వంటీ-20 మ్యాచ్ అనంతరం మహిళా ప్రజెంటర్‌తో అసభ్యంగా మాట్లాడి పీకల్లోతు వివాదాల్లోకి కూరుకుపోయాడు. ప్రత్యక్ష ప్రసారంలో టెన్‌స్పోర్ట్స్ ప్రజెంటర్ మెల్ మెక్‌లాలిన్‌ను తనతో తాగేందుకు బయటకు వస్తావా? అని అడుగడం తీవ్ర దుమారం రేపింది. దీంతో రెనగేడ్స్ జట్టు గేల్‌పై 10వేల డాలర్ల జరిమానా విధించింది. ఈ వివాదం ముగియకముందే ఓ ఆస్ట్రేలియా మహిళ ముందుకొచ్చి వరల్డ్ కప్ సందర్భంగా తనను గేల్ లైంగికంగా వేధించాడని వెల్లడించడం.. ఆయనను మరింత ఇరకాటంలో పడేసింది. ఫెయిర్‌ఫాక్స్ మీడియాలో ప్రసారమైన ఈ కథనాన్ని గేల్ మేనేజర్ సిమన్ అతూరి తీవ్రంగా ఖండించారు. ఫెయిర్‌ఫాక్స్ గేల్‌పై అసత్య ప్రచారాలు, అభూత కల్పనలు ప్రసారం చేస్తున్నదని, అందుకే దానిపై పరువునష్టం దావా వేసేందుకు ప్రముఖ లాయర్ మార్క్ ఒబ్రియన్‌ను గేల్ నియమించుకున్నట్టు సిమన్ ఓ ప్రకటనలో తెలిపారు.