ఆ మీడియా సంస్థపై పరువునష్టం వేస్తా: గేల్
మెల్‌బోర్న్: అసభ్య వ్యాఖ్యలు, లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్.. ప్రముఖ ఆస్ట్రేలియా మీడియా సంస్థ ఫెయిర్‌ఫాక్స్‌పై పరువునష్టం దావా వేయాలని భావిస్తున్నారు. గత ఏడాది వరల్డ్ కప్ సందర్భంగా సిడ్నీలో ఆస్ట్రేలియా మహిళతో క్రిస్ గేల్ అసభ్యకరంగా వ్యవహరించాడని ఫెయిర్‌ఫాక్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఫెయిర్‌ఫాక్స్‌పై దావా వేసేందుకు ఆయన ఓ ప్రముఖ ఆస్ట్రేలియన్ లాయర్ సేవలను కోరారు.
బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనగేడ్స్ జట్టు తరఫున ఆడుతున్న క్రిస్ గేల్ ట్వంటీ-20 మ్యాచ్ అనంతరం మహిళా ప్రజెంటర్‌తో అసభ్యంగా మాట్లాడి పీకల్లోతు వివాదాల్లోకి కూరుకుపోయాడు. ప్రత్యక్ష ప్రసారంలో టెన్‌స్పోర్ట్స్ ప్రజెంటర్ మెల్ మెక్‌లాలిన్‌ను తనతో తాగేందుకు బయటకు వస్తావా? అని అడుగడం తీవ్ర దుమారం రేపింది. దీంతో రెనగేడ్స్ జట్టు గేల్‌పై 10వేల డాలర్ల జరిమానా విధించింది. ఈ వివాదం ముగియకముందే ఓ ఆస్ట్రేలియా మహిళ ముందుకొచ్చి వరల్డ్ కప్ సందర్భంగా తనను గేల్ లైంగికంగా వేధించాడని వెల్లడించడం.. ఆయనను మరింత ఇరకాటంలో పడేసింది. ఫెయిర్‌ఫాక్స్ మీడియాలో ప్రసారమైన ఈ కథనాన్ని గేల్ మేనేజర్ సిమన్ అతూరి తీవ్రంగా ఖండించారు. ఫెయిర్‌ఫాక్స్ గేల్‌పై అసత్య ప్రచారాలు, అభూత కల్పనలు ప్రసారం చేస్తున్నదని, అందుకే దానిపై పరువునష్టం దావా వేసేందుకు ప్రముఖ లాయర్ మార్క్ ఒబ్రియన్‌ను గేల్ నియమించుకున్నట్టు సిమన్ ఓ ప్రకటనలో తెలిపారు.