ఒకే ఒక్కడు గేల్..
రాజ్ కోట్: ప్రపంచ ట్వంటీ 20 క్రికెట్ లో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్ లో పది వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న ఏకైక ఆటగాడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా మంగళవారం గుజరాత్ లయన్స్ తో మ్యాచ్ ద్వారా మూడు పరుగుల్ని పూర్తి చేసుకున్న తరువాత గేల్ ఈ రికార్డును సాధించాడు. గుజరాత్ బౌలర్ బాసిల్ తంపి వేసిన నాల్గో ఓవర్ మూడో బంతికి పదివేల పరుగుల్ని గేల్ పూర్తి చేసుకున్నాడు.
ఈ ఐపీఎల్ సీజన్ కు ముందు 63 పరుగుల దూరంలో ఉన్న గేల్.. పదివేల పరుగుల మార్కును చేరడానికి నాలుగు మ్యాచ్ లను ఆడాల్సి వచ్చింది. ఆర్సీబీ ఆడిన తొలి మ్యాచ్ లో భాగంగా సన్ రైజర్స్ తో మ్యాచ్ లో 32 పరుగులు చేసిన గేల్.. ఆపై ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆపై ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో 22 పరుగుల్ని గేల్ సాధించాడు. ఇలా వరుస వైఫల్యాల తరువాత గేల్ కొత్త రికార్డను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్ గా గేల్ తన ట్వంటీ 20 కెరీర్ లో 290 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 285 ఇన్నింగ్స్ లు ఆడిన గేల్ 18 సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలను సాధించాడు. ఈ ఫార్మాట్ లో అతని అత్యధిక స్కోరు 175 నాటౌట్. అతని స్ట్టైక్ రేట్ దాదాపు 150 గా ఉండటం ఇక్కడ మరో విశేషం.