క్రికెటర్ యువరాజ్ సింగ్
న్యూఢిల్లీ: పొట్టి ఫార్మాట్ క్రికెట్ టీ20ల్లో తన సహచరుడు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు క్రిస్ గేల్ అత్యంత ప్రమాదకారి అని టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ప్రపంచంలోని అత్యంత విధ్వంసకర క్రికెటర్లలో క్రిస్ గేల్ ఒకడని, అతడు రాణించడంతో ఐపీఎల్ 11 సీజన్లో పంజాబ్ విజయాల బాట పట్టిందన్నాడు. తొలుత ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలని చూస్తున్నాం, ఒకవేళ ఫ్లే ఆఫ్స్ చేరితే కప్పు నెగ్గడమే తమ ముందున్న లక్ష్యమని యువరాజ్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ పటిష్ట జట్లు అని ఆ జట్టకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నాడు యువీ.
రిటైర్మెంట్‌పై నోరు విప్పిన యువీ
2019 ప్రపంచ కప్ తర్వాతే రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటిస్తానని యువరాజ్ తెలిపాడు. గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో యువీ చివరగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇంగ్లండ్, వేల్స్‌లో 2019లో జరిగే వన్డే ప్రపంచ కప్ వరకూ కెరీర్ కొనసాగించనున్నట్లు వెల్లడించాడు. ప్రతి క్రికెటర్‌కు ఇలాంటి సమయం కచ్చితంగా వస్తుందని, నిర్ణయం తీసుకోక తప్పదన్నాడు. '2000లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించా. దాదాపు 17-18 ఏళ్ల పాటు టీమిండియాకు ఆడుతూ క్రికెట్‌ను ఆస్వాదించాను. ఎన్నేళ్లు క్రికెట్ ఆడినా ఏదో ఓ రోజు రిటైర్ కావాల్సి ఉంటుంది. వచ్చే వన్డే ప్రపంచ కప్‌లో ఆడాలని భావిస్తున్నాను. అవకాశం వచ్చినా.. రాకున్నా అప్పటివరకూ దేశవాలీ క్రికెట్ ఆడతాను. 2019 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటానని' యువీ వివరించాడు.
కాగా, టీమిండియా 2011 వన్డే ప్రపంచ కప్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన క్రికెటర్ యువీకి 2015 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం దక్కలేదు. 90.50 బ్యాటింగ్ సగటుతో ఆ మెగా టోర్నీలో 362 పరుగులు చేసిన యువీ 15 వికెట్లు తీసి ఆల్ రౌండ్ నైపుణ్యంతో రాణించాడు. మ్యాన్ ఆఫ్ టోర్నీ అందుకున్నాడు. కానీ, క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత యువీ పూర్వపు ఫామ్‌తో కెరీర్ కొనసాగడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment