నేను ‘కూలీ’ని కాదు!
క్రిస్ గేల్ ఆవేదన
జమైకా: ఒక వైపు ఐపీఎల్, మరోవైపు బిగ్‌బాష్, ఒకసారి కరీబియన్ లీగ్, మరోసారి బంగ్లా లీగ్... ఇలా ప్రపంచం మొత్తం టి20 క్రికెట్ లీగ్‌లలో ఎక్కువగా కనిపించే ఆటగాడు క్రిస్ గేల్. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ ఫార్మాట్‌లో సూపర్ స్టార్‌గా ఉన్న గేల్ చివరకు జింబాబ్వేలోని 20 సిరీస్ లీగ్ టోర్నీలో కూడా పాల్గొన్నాడు.
అయితే వెస్టిండీస్ జట్టు తరఫున మాత్రం అతను రెగ్యులర్‌గా ఆడటం లేదు. గాయంతోనో, మరో కారణంతోనే చాలా సందర్భాల్లో జట్టుకు దూరంగా ఉంటున్నాడు. దీనిని దృష్టిలో ఉంచుకొని అతడిని అంతా ‘టి20 కూలీ’ (మెర్సినరీ)గా విమర్శిస్తున్నారు. సొంత దేశం తరఫున కాకుండా డబ్బు ఇస్తే పరాయి దేశం తరఫున కూడా యుద్ధం చేసే సిపాయిని మెర్సినరీగా వ్యవహరిస్తారు. కేవలం డబ్బు కోసమే పని చేయడం వీరి లక్షణం. అయితే ఈ విమర్శపై గేల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెటర్లను అలా పిల వడం తనను బాధిస్తోందని అతను అన్నాడు.
‘ఆటగాళ్లను అలా అనడం దురదృష్టకరం. దీని వల్ల అతనితో పాటు క్రికెట్ గౌరవాన్ని కూడా తగ్గిస్తున్నారు. మమ్మల్ని ‘మెర్సినరీ’గా పిలవద్దు. అదనపు సంపాదన, కుటుంబ పోషణ కోసం డబ్బు సంపాదించుకునేందుకు మాకు ఇది ఉపయోగపడుతుంది. నాతో పాటు ప్రపంచంలో చాలా మంది క్రికెటర్లు ఇదే చేస్తున్నారు’ అని గేల్ వాపోయాడు. ప్రతీ ఆటగాడికి దేశం తరఫున ఆడాలనే ఉంటుందని, అయితే ఆర్థికపరమైన భద్రత కోసమే లీగ్‌లపై దృష్టి పెడుతున్నారని అతను అన్నాడు.