ప్రేక్షకులను అలరిస్తా : గేల్
కింగ్ స్టన్: ఏడాది తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన టీ20 విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను రంజింప చేస్తానని తెలిపాడు. ఆదివారం భారత్‌తో జరిగే ఎకైక టీ20కి విండీస్ జట్టులోకి తిరిగి వచ్చిన గేల్ బ్యాటింగ్‌తో రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. చాలా రోజుల తర్వాత జట్టులోకి రావడం సంతోషంగా ఉందన్న గేల్, హోం గ్రౌండ్‌లో భారత్‌తో ఆడటం మరింత ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఇక 37 ఏళ్ల జమైకన్ ముందు రిటైర్మెంట్ ప్రస్తావన తీయగా అభిమానులు తన ఆటను కోరుకుంటున్నారని, మరి కొన్ని సంత్సరాలు ఆడుతాననే నమ్మకం ఉందని తెలిపాడు.
వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ ఆడటమే తన లక్ష్యమని గేల్ పేర్కొన్నాడు. ఇక సీనియర్ ఆటగాళ్లను కూడా విండీస్ బోర్డు జట్టులోకి ఆహ్వానిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. జట్టుకు సీనియర్లు అవసరమని, అదే విధంగా భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్లను సిద్ధం చేయాలని తెలిపాడు. ఇక వన్డేల్లో భారత్‌పై తమ ఆటగాళ్లు తమ పరిధి మేరకు రాణించారని గేల్ వెనుకేసుకొచ్చాడు. భారత్ ఎప్పుడూ మా ఫేవరేట్ అని వారి నుంచి యువ ఆటగాళ్లు చాలా నేర్చుకున్నారని పేర్కొన్నాడు. భారత్ 3-1తో వన్డే సిరీస్ నెగ్గగా నేడు ఎకైక టీ20 ఆడనుంది.