
జొహన్నెస్‌బర్గ్: రెండు ఓటముల అనంతరం... మూడో టెస్టు ముంగిట... టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రికి తత్వం బోధపడింది. జట్టు వైఫల్యానికి విదేశీ ప్రత్యేక పరిస్థితులే కారణమని విశ్లేషించిన ఆయన... దక్షిణాఫ్రికా పర్యటనకు ముందుగానే వచ్చి ఉండాల్సిందంటూ సోమవా రం జట్టు ప్రాక్టీస్ అనంతరం నిర్వహించి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఫామ్ ఆధారంగా రహానే కంటే రోహిత్ శర్మను మేలైన ఎంపికగా భావించామని చెప్పుకొచ్చారు. ‘స్వదేశంలో పరిస్థితులు మనకు అలవాటై ఉంటాయి. పెద్దగా పోరాడాల్సిన అవసరం ఏర్పడదు. కానీ విదేశాల్లో అంతా భిన్నం. అందుకని ఇక్కడకు ఓ పది రోజులు ముందుగానే వచ్చి ఉంటే కథ మరోలా ఉండేది. రాబోయే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలకు ప్రధాన ఆటగాళ్లను ముందుగానే పంపించే యోచన ఉంది. పిచ్‌లు రెండు జట్లకు ఒకేలా ఉన్నాయి. మేం రెండు టెస్టుల్లో ప్రత్యర్థి 20 వికెట్లు తీశాం. కాబట్టి ఓటమికి మినహాయింపులు లేవు.
మా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రాణిస్తే మూడో టెస్టు కూడా మంచి మ్యాచ్ అవుతుంది’ అని శాస్త్రి అన్నారు. ‘మా బౌలర్లు ఇంత అద్భుతంగా రాణిస్తారని ఎవరూ ఊహించలేదు. ఈ పర్యటనలో ఇది మాకు పెద్ద సానుకూలాంశం. ఒకవేళ తొలి టెస్టులో రహానే ఉండి, అతడు విఫలమైతే రోహిత్‌ను ఎందుకు తీసుకోలేదనేవారు. ఇప్పుడు రోహిత్ విఫలం కావడంతో రహానే గురించి అడుగుతున్నారు. విదేశాల్లో ఆడేందుకు ఫామ్ ముఖ్యమా? పరిస్థితులు ముఖ్యమా? అంటే పరిస్థితులను త్వరగా అర్థం చేసుకునేవారు కావాలి. అయినా దేనికైనా మీకు అవకాశం ఉంది. పేస్ బౌలర్ల విషయంలోనూ ఇలాగే స్పందించేవారు. కానీ టీం మేనేజ్‌మెంట్ ఉత్తమ ఎంపికలపై చర్చించింది. వాటికే కట్టుబడి ఆడుతోంది’ అని కోచ్ వివరించారు. ‘రెండో టెస్టులో భారత ఆటగాళ్ల రనౌట్లు పాఠశాల విద్యార్థుల తప్పుల్లా ఉన్నాయి. అవి తీవ్రంగా బాధించాయి. మ్యాచ్ రెండు జట్ల మధ్య పోటాపోటీగా ఉన్న దశలో ఈ విధంగా వికెట్లు ఇవ్వడం సరికాదు. ఆటగాళ్లు కూడా అదే చెప్పారు’ అని శాస్త్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment