న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి రెండు టెస్టులు ఓడిన తర్వాత కొంతమంది స్పందించిన తీరు చాలా దారుణంగా ఉందని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి మండిపడ్డాడు. తొలి రెండు టెస్టుల్లో గెలుపు అంచుల వరకూ వచ్చిన సంగతిని పలువురు మాత్రమే గుర్తించగా, అదే పనిగా విమర్శించే వాళ్లు మాత్రం ఓడితే మాత్రం చెలరేగిపోయి మరీ విమర్శించారన్నారు. అది కూడా భారత్‌లో ఉన్న కొంతమంది విమర్శలకు తమ ఓటమి అమితానందాన్ని తీసుకొచ్చినట్లు కనిపించిందని రవిశాస్త్రి కౌంటర్ ఎటాక్‌కు దిగాడు.
దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని జట్టుతో పాటు స‍్వదేశానికి చేరుకున్న రవిశాస్త్రి.. సఫారీ గడ్డపై భారత జట్టు ప్రదర్శనపై ముచ్చటించాడు. ఈ క్రమంలోనే కొంతమంది విమర్శకులపై రవిశాస్త్రి సెటైర్లు గుప్పించాడు. 'టెస్టు సిరీస్ తొలి రెండు మ్యాచ్‌లు కూడా మేం గెలవాల్సినవే అని చాలా కొద్ది మంది మాత్రమే గ్రహించారు. భారత జట్టు ఓడితేనే దేశంలో చాలామంది సంతోషిస్తారేమో అన్న భావన కలిగింది. తొలి రెండు టెస్టుల్లో రెండు సెషన్లలో వెనకబడటం వల్ల మ్యాచ్‌లు చేజారాయి. మేం డ్రా కోసం ఆడలేదు. గెలవడానికే ఆడాం. జోహన్నెస్‌బర్గ్‌లో తొలుత బ్యాటింగ్ చేయడం ఒక రిస్క్.. అయినా మేము ముందుగా బ్యాటింగ్ చేసి గెలిచాం.
మనోళ్లు గెలిస్తే అవతలి జట్టు బాగా ఆడలేదంటారు. శ్రీలంకలో నెగ్గితే వాళ్లది అత్యుత్తమ జట్టు కాదంటారు. దక్షిణాఫ్రికాలో నెగ్గితే ఇదే మాట అంటారు. మన ప్రదర్శనను బట్టే ప్రత్యర్థి సత్తా తెలుస్తుంది. ఓడినపుడు భారత జట్టు బాగా లేదన్న మాట ఎవ్వరూ అనరు. మేం దక్షిణాఫ్రికాతో ఆడాం. ఆ జట్టు తరఫున ఎవరు ఆడతారు, ఎవరు ఆడరు అన్నది మా సమస్య కాదు' రవిశాస్త్రి ఘాటుగా విమర్శించాడు.శ్రీలంక పర్యటనకు కొంతమందికి ఎందుకు రెస్ట్ ఇచ్చామనేది మానవీయ కోణంలో ఆలోచించాలన్నాడు. భారత్‌లో ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయని, ఏ పరిస్థితుల్లోనైనా గెలుపు లక్ష్యమని రవిశాస్త్రి తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment