గిరగిరా తిరగాల్సిందే..!
టెస్టులన్నింటికీ స్పిన్ పిచ్‌లే స్పష్టం చేసిన రవిశాస్త్రి
మొహాలి: సొంతగడ్డపై తమకు అనుకూల పిచ్‌లను ఆయా జట్లు సిద్ధం చేయడంలో తప్పేమీ లేదని, ఇదేమీ రహస్యం కూడా కాదని భారత టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి కుండబద్దలు కొట్టారు. దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల సిరీస్ కోసం అన్ని వేదికల్లోనూ తమకు అనుకూలమైన స్పిన్ పిచ్‌లే ఉంటాయని ఆయన గట్టిగా చెప్పేశారు. ‘ఏ జట్టయినా తమ బలాన్ని బట్టి వికెట్‌ను సిద్ధం చేస్తుంది. స్వదేశంలో అందరూ అలాగే ఆశిస్తారు. చాలా ఏళ్లుగా జరుగుతోంది ఇదే. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వెళ్లి తొలి రోజే బంతి తిరగాలని ఆశించలేం కదా’ అని పరోక్షంగా మొహాలి పిచ్ గురించి శాస్త్రి వ్యాఖ్యానించారు. 2001లో భారత్, ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత ఆ స్థాయి పోరుగా శాస్త్రి ప్రస్తుత భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌ను అభివర్ణించారు.
శ్రీలంకపై సిరీస్ గెలిచిన కోహ్లి సేన రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉందని, సఫారీలాంటి నంబర్‌వన్ జట్టును ఎదుర్కోవడం అనుభవం పరంగా యువ ఆటగాళ్లకు మేలు చేస్తుందన్న శాస్త్రి... ఇది గెలిస్తే గొప్ప ఘనత అవుతుందన్నారు. ‘గత ఏడేళ్లుగా దక్షిణాఫ్రికా సిరీస్ కోల్పోలేదు. ఆ రికార్డును అడ్డుకునే అవకాశం ఇప్పుడు టీమిండియా కు ఉంది. టి20, వన్డేలు గెలిచినా సఫారీలకు టెస్టులు కూడా గెలిచే అవకాశం ఇవ్వరాదని మేం పట్టుదలగా ఉన్నాం’ అని శాస్త్రి చెప్పారు. ఇటీవల వాంఖడే మైదానంలో క్యురేటర్ సుధీర్ నాయక్‌తో వివాదానికి సంబంధించి చాలా మాట్లాడానని, ఇక చెప్పేందుకు ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
మరో ఇద్దరు ఉన్నారు...
ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి టెస్టుకు సిద్ధమయ్యాడు. అతను పూర్తి ఫిట్‌గా ఉన్నాడని, మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని రవిశాస్త్రి వెల్లడించారు. మంగళవారం జట్టుతో పాటు సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన అశ్విన్, వార్మప్‌గా ఫుట్‌బాల్ కూడా ఆడాడు. అశ్విన్‌పై ఎక్కువగా దృష్టి పెట్టి దక్షిణాఫ్రికా తమ వద్ద మరో ఇద్దరు స్పిన్నర్లు (జడేజా, మిశ్రా)కూడా ఉన్నారనే విషయాన్ని మరచిపోతోందని ఈ సందర్భంగా రవిశాస్త్రి హెచ్చరించారు.
4-0 గెలిస్తే రెండో ర్యాంక్‌కు
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే భారత జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానం నుంచి రెండో ర్యాంక్‌కు చేరుకుంటుంది.
ఫేవరెట్లం కాదు: స్టెయిన్
టెస్టు సిరీస్‌లో తాము ఫేవరెట్లం కాదని దక్షిణాఫ్రికా పేసర్ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. ‘మేం భారత గడ్డపై ఆడుతున్నాం. వారిపై ఆధిక్యం ప్రదర్శించడం చాలా కష్టం’ అని స్టెయిన్ అన్నాడు. భారత్‌లో జరిగే టెస్టు మ్యాచ్ చివరి రోజుల్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారిపోతోందని, కాబట్టి టాస్ గెలవడం కీలకం అని బ్యాట్స్‌మన్ ఎల్గర్ అన్నాడు.