సాక్షి, స్పోర్ట్స్: దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా ఓటమితో మొదలుపెట్టగా.. లోపాలను సరిదిద్దుకునే పనిలో పడింది జట్టు. అయితే కేప్‌టౌన్‌లో జరిగిన తొలిటెస్టులో చోటుదక్కించుకున్నా.. శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు విఫలమవడంతో టీమిండియాకు పరాభవం ఎదురైందని విశ్లేషకులు అభిపప్రాయపడుతున్నారు. అయితే భారత జట్టు ఓటమికి టీమ్ మేనేజ్‌మెంట్‌లో భాగమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రిల నిర్ణయాలు కారణమని అర్థమవుతోంది. ఈ పర్యటనకు పూర్తిస్థాయి జట్టు కంటే ముందుగానే శ్రీలంకతో సిరీస్‌కు విశ్రాంతిలో ఉన్న క్రికెటర్లు, టెస్టులో కీలకంగా మారే ప్లేయర్లు అయిన మురళీ విజయ్, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, చటేశ్వర్ పుజారాలను దక్షిణాఫ్రికాకు పంపితే వారు అక్కడి పిచ్ పరిస్థితులకు అలవాటు పడతారని బీసీసీఐ సూచించింది.
బీసీసీఐతో పాటు సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (సీఓఏ) సైతం కోహ్లీ, రవిశాస్త్రిలతో ఈ విషయాన్ని ప్రస్తావించినా వారు పెడచెవిన పెట్టారట. ఇంకా తొలిటెస్టు ప్రారంభానికి ముందుగానే వార్మప్ మ్యాచ్ ఆడితే ప్రయోజనం ఉంటుందని టీమ్ మేనేజ్‌మెంట్‌కు చెప్పినా వాళ్లు ప్రాక్టీస్ సెషన్లపై దృష్టిసారించడం కొంపముంచిందని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తాజాగా వెల్లడించారు. కొందరు ఆటగాళ్లను ముందుగానే దక్షిణాఫ్రికా పంపేందుకు అయ్యే అధిక ఖర్చులను సైతం భరిస్తామని బీసీసీఐ చేసిన సూచనల్ని పట్టించుకోలేదు. కీలకమైన సఫారీ టూర్ నేపథ్యంలో లంకతో సిరీస్‌లకు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి నిచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ 28న అక్కడికి వెళ్లినా నూతన సంవత్సర వేడుకలు అంటూ విలువైన సమయాన్ని వృథా చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు తొలి టెస్టులో ఎందుకు ఆడించలేదని పేర్కొన్న అజింక్య రహానే, లోకేశ్ రాహుల్‌లు ప్రాక్టీస్ సెషన్లో అధిక సమయాన్ని గడిపారు. పేసర్ ఇషాంత్ శర్మ, రెండో వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ కూడా ప్రాక్టీస్ చేయడంతో రెండో టెస్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment