సెల్ఫీ ఇంటర్వ్యూ సందర్భంగా కెప్టెన్ కోహ్లితో రోహిత్ శర్మ
పోర్ట్ ఎలిజబెత్: వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా తమ స్థాయికి తగ్గట్లు ఆడి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇక్కడ జరిగిన ఐదో వన్డేలో 73 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై నెగ్గడంతో పాటు మరో వన్డే మిగిలుండగానే 4-1తో భారత క్రికెట్ జట్టు తొలిసారి వన్డే సిరీస్ కైవసం చేసుకుని 25 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వినూత్నంగా సెల్ఫీ ఇంటర్వ్యూ చేశాడు. బీసీసీఐ కోరిక మేరకు చేసిన ఇంటర్వ్యూలో విజయంపై కోహ్లి పలు అంశాలను ప్రస్తావించాడు. బీసీసీఐ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
రోహిత్: దక్షిణాఫ్రికాలో టీమిండియాకు గతంలో సాధ్యం కాని వన్డే సిరీస్ విజయాన్ని సాధించడంపై కెప్టెన్‌గా, ఆటగాడిగా ఎలా ఫీలవుతున్నావ్?
కోహ్లి: చాలా ఆనందంగా ఉంది. గతంలో ఆరు సార్లు భారత్ ఇక్కడ పర్యటించినా లాభం లేకపోయింది. 25 ఏళ్ల తర్వాత సఫారీల గడ్డపై భారత్ తొలిసారిగా సిరీస్ విజయం జట్టులో ప్రతి ఒక్కరి శ్రమవల్లే సాధ్యమైంది. రోహిత్ ఈ మ్యాచ్‌లో బాగా ఆడటం కలిసొచ్చింది. అరుదైన సిరీస్ విజయంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. భారత ఆటగాళ్లు ఈ చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు.
రోహిత్: టీమిండియా సిరీస్ విజయానికి కారణాలేమిటి ?
కోహ్లి: ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు కీలక ప్రదర్శనతో రాణించారు. ముఖ్యంగా బౌలర్లు సులువుగా వికెట్లు తీయడం వల్లే విజయాలు సాధ్యమయ్యాయి. మణికట్టు స్పిన్నర్లు యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్‌లు కీలక సమయంలో వికెట్లు పడగొట్టారు. వీరికి తోడు సీమర్లు జస్ప్రిత్ బూమ్రా, భువనేశ్వర్‌లు నిలకడగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి ఆటగాళ్లను కట్టడి చేశారు.
రెండేళ్ల క్రితం సొంతగడ్డపై ఎదురైన వన్డే సిరీస్ పరాజయానికి కూడా సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కాగా, ఇరు జట్ల మధ్య చివరి వన్డే శుక్రవారం (ఫిబ్రవరి 16న) సెంచూరియన్‌లో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment