Cricket Fans Slam Team India Management Kohli, Rohit Not Played 2nd ODI - Sakshi
Sakshi News home page

ICC ODI WC 2023: వరల్డ్‌కప్‌ జరిగేది మన దగ్గర.. విండీస్‌లో కాదుగా; ఈ ప్రయోగాలేంది?

Published Sun, Jul 30 2023 9:12 AM | Last Updated on Sun, Jul 30 2023 11:01 AM

Cricket Fans Slams Team India Management-Kohli-Rohit Not Played 2nd ODI - Sakshi

మరో మూడు నెలల్లో భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్ మొదలుకానుంది. ఒక ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు ఏ జట్టు ప్రయోగాలు చేయాలనుకోదు. ఎందుకంటే వరల్డ్‌కప్‌ సమయానికి ఆయా జట్లు తమ బలం, బలహీనతలు ఏంటనేది తెలుసుకోవాలనుకుంటాయి. వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా ఏ జట్టైనా ప్రయోగాలకు పోకుండా ప్రధాన జట్టుతోనే బరిలోకి దిగి సిరీస్‌లు ఆడడం చూస్తుంటాం. కానీ పుష్కరకాలం తర్వాత  వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్న టీమిండియా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో అనవసర ప్రయోగాలు చేస్తూ చేతులు కాల్చుకుంటుంది. 

ప్రయోగాలు చేయడం మంచిదే కానీ ఈ సమయంలో అది కరెక్ట్‌ కాదు. ఎందుకంటే వరల్డ్‌కప్‌ జరిగేది మన దేశంలో.. విండీస్‌లో కాదు కదా. ఈ ఒక్క లాజిక్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఎలా మరిచిపోయిందన్నది ఆసక్తికరంగా మారింది. విండీస్‌ చిన్న జట్టే కావొచ్చు.. కానీ ముందున్న మెగా సమరానికి సన్నద్ధమవ్వాలంటే పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగడం మంచిది.

తొలి వన్డేలో వెస్టిండీస్‌ తక్కువ స్కోరుకే ఆలౌట్‌ అయినా.. టీమిండియా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగి విజయాన్ని అందుకుంది. అయితే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో రోహిత్‌, కోహ్లిలు తమ తమ స్థానాల్లో రాలేదు. లక్ష్యం చిన్నదే కావొచ్చు.. కానీ రోహిత్‌ ఓపెనర్‌గా.. కోహ్లి వన్‌డౌన్‌లో వచ్చి బ్యాటింగ్‌ చేసి ఉంటేనే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. దీనికి తోడు స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోవడం కొంత ఆందోళన కలిగించింది. చివరికి మళ్లీ రోహిత్‌ వచ్చి పనిని పూర్తి చేశాడు. 

వరల్డ్‌కప్‌ ప్రారంభానికి ముందు ఎన్ని మ్యాచ్‌లు ఆడితే అంత మంచిది. బ్యాటర్లకు అంతే ప్రాక్టీస్‌ దొరుకుతుంది. అది వదిలేసి విండీస్‌తో రెండో వన్డేకు ఏకంగా రోహిత్‌, కోహ్లిని పక్కన కూర్చోబెట్టి పాండ్యాకు సారధ్య బాధ్యతలు అప్పజెప్పి పెద్ద తప్పు చేశారు. కోహ్లి, రోహిత్‌లకు బహుశా ఇదే ఆఖరి వరల్డ్‌కప్‌ కావొచ్చు. ఈ సమయంలో వారికి ఎక్కువ అవకాశాలివ్వాలి. ఎలాగూ వారిద్దరు రిటైర్‌ అయితే అప్పుడు కొత్త జట్టు తయారు కావాల్సిందే.

బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్చడమేంటి?
కానీ వరల్డ్‌కప్‌ ముందు ఇలాంటి ప్రయోగాలు అవసరమా అనిపిస్తుంది. రోహిత్‌, కోహ్లిలను పక్కనబెట్టి తప్పు చేశారంటే.. మళ్లీ రెండో వన్డేలో బ్యాటింగ్‌ ఆర్డర్‌లోనూ మార్పులు చేయడం సగటు అభిమానికి నచ్చలేదు. సూర్యకుమార్‌ తాను రెగ్యులర్‌గా రావాల్సిన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రాకుండా ఆరో స్థానంలో రావడం జట్టును దెబ్బతీసింది. సూర్యకు నాలుగో స్థానం కంఫర్ట్‌గా ఉంటుందని అందరికి తెలుసు. అతన్ని కాదని ఆ స్థానంలో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను పంపించి పాండ్యా తప్పు చేశాడనిపించింది. 

ఓపెనర్లుగా శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌లు మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికి ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. సంజూ శాంసన్‌కు అవకాశాలు ఇవ్వడం లేదని మొరపెట్టుకున్నారు.. తీరా అవకాశమిస్తే అతను విఫలమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా పాండ్యా కూడా ఫెయిలయ్యాడు. సూర్య స్థానాన్ని మార్చడంతో అతని బ్యాటింగ్‌ లయ దెబ్బతినే అవకాశముంది. ప్రతీసారి జడేజా ఆడాలంటే కుదరదు. రెండో వన్డే ఓటమితోనైనా టీమిండియా పాఠం నేర్చుకుందని భావిద్దాం.

కనీసం మూడో వన్డేలోనైనా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగి.. ఎవరు స్థానాల్లో వారు బ్యాటింగ్‌కు రావడం మంచిది. రెండో వన్డేలో దారుణ బ్యాటింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మూడో వన్డేలో అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించాలని కోరుకుందాం. వన్డే వరల్డ్‌కప్‌కు ఇంకా మూడు నెలలే మిగిలి ఉండడంతో అనవసర ప్రయోగాల జోలికి పోకుండా సిరీస్‌ను ముగించడం ఉత్తమం. ఈ సిరీస్‌ తర్వాత టీమిండియా నేరుగా ఆసియా కప్‌లో ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం నేరుగా వన్డే వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టనుంది. 

చదవండి: పిచ్చి ప్రయోగాలు ఎందుకు? తల పట్టుకున్న విరాట్‌ కోహ్లి! వీడియో వైరల్‌

Carlos Alcaraz: సంచలనాల 'అల్‌కరాజ్‌'.. 'ఆల్‌టైమ్‌ గ్రేట్‌' లక్షణాలు పుష్కలంగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement