
West Indies vs India, 3rd ODI- Hardik Panyda Comments: ‘‘ఈ గెలుపు మాకెంతో ప్రత్యేకం. కెప్టెన్‌గా నాకు గుర్తిండిపోయే విజయం. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోయి ఉంటే.. ఏం జరిగేదో మాకు తెలుసు. పూర్తిగా నిరాశలో కూరుకుపోయే వాళ్లం. అయితే, మా కుర్రాళ్లు పట్టుదలతో అసాధారణ ఆట తీరు కనబరిచారు.
తీవ్ర ఒత్తిడితో కూడుకున్న మ్యాచ్‌లోనూ ఆటను ఆస్వాదిస్తూ ముందుకు దూసుకుపోయారు. విరాట్, రోహిత్ జట్టులో అంతర్భాగం. అయితే, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలంటే వాళ్లిద్దరికి విశ్రాంతినివ్వక తప్పదు.
అందుకే కఠిన నిర్ణయాలు.. విరాట్‌కు థాంక్స్
యువకులకు ఛాన్స్ ఇచ్చే క్రమంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్‌కు ముందు విరాట్‌తో గేమ్ గురించి చర్చించాను. వన్డే ఫార్మాట్లో నేను మిడిలార్డర్‌లో తప్పకుండా రాణించాలని, ఎక్కువసేపు క్రీజులో ఉండేలా చూసుకోవాలని చెప్పాడు. తన అనుభవాలను నాతో పంచుకున్నందుకు విరాట్‌కు థాంక్స్ చెప్పాలనుకుంటున్నా.
విండీస్ ఆలస్యంగా కళ్లు తెరిచింది
ఇలాంటి పిచ్‌పై 350 రన్స్ సాధించడం మేలు చేసింది. భారీ స్కోరు సాధించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. వెస్టిండీస్ ఆలస్యంగా కళ్లు తెరిచింది. 34వ ఓవర్ వరకు మ్యాచ్‌ను లాక్కొని రాగలిగింది. నిజానికి పవర్ ప్లేలో రాణిస్తేనే భారీ లక్ష్య ఛేదనలో ముందుకు వెళ్లగలం’’ అని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. వెస్టిండీస్‌తో మూడో వన్డేలో భారత్ ఘన విజయం నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఆ నలుగురు..
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా స్టేడియంలో హార్దిక్ సేన విండీస్‌తో మంగళవారం ఆఖరి వన్డేలో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది.
ఓపెనర్లు ఇషాన్ కిషన్(77), శుబ్‌మన్ గిల్(85)లతో పాటు.. సంజూ శాంసన్(51), హార్దిక్ పాండ్యా(70- నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో ఈ మేరకు భారీ స్కోరు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు.. భారత బౌలర్ల విజృంభణతో 151 పరుగులకే ఆలౌట్ అయింది.
రెచ్చిపోయిన పేసర్లు..
టీమిండియా పేసర్లలో శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లతో చెలరేగగా.. ముకేశ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. జయదేవ్ ఉనాద్కట్‌కు ఒక వికెట్ దక్కింది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లతో మెరిశాడు. ఈ క్రమంలో 200 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. 2-1తో ట్రోఫీని గెలిచింది. గత మ్యాచ్‌లో విండీస్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. ఇక ఈ మ్యాచ్‌లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలకు విశ్రాంతినివ్వగా.. హార్దిక్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు.
చదవండి: Ind vs WI: విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. అరుదైన రికార్డు! ప్రపంచంలోనే ఏకైక జట్టుగా..
Well played. Deserved a 💯@ShubmanGill
— FanCode (@FanCode) August 1, 2023
.
.#INDvWIAdFreeonFanCode #WIvIND pic.twitter.com/KPWdZjFQt6