Rohit Sharma & Virat Kohli: టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రెండు వారాల పాటు సెలవుల్లో గడుపనున్నారు. ఆటకు విరామమిచ్చి విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకుని వారం రోజుల పాటు శిక్షణా శిబిరంలో పాల్గొననున్నారు. కాగా వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ సహా కోహ్లి అదరగొట్టిన విషయం తెలిసిందే.
టెస్టుల్లో అదరగొట్టారు
డొమినికా మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ(103) సాధించగా.. కోహ్లి 76 పరుగులు చేశాడు. ఇక ట్రినిడాడ్ టెస్టులో రోహిత్ మొత్తంగా 137 పరుగులు చేయగా.. కోహ్లి శతకం(121)తో మెరిశాడు. ఇక మూడు వన్డేల సిరీస్‌లో హిట్‌మ్యాన్ తొలి మ్యాచ్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగి 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.
రోహిత్ విజయ లాంఛనం పూర్తి చేయడంతో కోహ్లికి బ్యాటింగ్ చేయాల్సిన అవసరమే రాలేదు. ఇక రెండో వన్డే నుంచి కూడా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే క్రమంలో మేనేజ్‌మెంట్ రోహిత్- కోహ్లిలకు పూర్తిగా విశ్రాంతినిచ్చింది. ఇక ఈ ఇద్దరు స్టార్లు లేకుండానే యువ జట్టు సిరీస్‌ను 2-1తో గెలిచింది.
ఐర్లాండ్‌కు యువ జట్టు
ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ‘విరాహిత్’ ద్వయం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా ఐర్లాండ్‌కు వెళ్లనుంది. ఆగష్టు 18-23 మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇస్తున్న జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలో యువ జట్టు అక్కడికి వెళ్లనుంది.
ఆగష్టు 23న అక్కడికి
ఆ తర్వాత మళ్లీ భారత ప్రధాన ఆటగాళ్లు మైదానంలో దిగేది ఆసియా వన్డే కప్-2023 టోర్నీలోనే! ఈ నేపథ్యంలో మరో పదిహేను రోజుల పాటు విరాట్, రోహిత్‌లకు సెలవులు లభించాయి. అయితే, ఆగష్టు 30 నుంచే ఆసియా కప్ ఈవెంట్ ఆరంభం కానున్న తరుణంలో ఈనెల 23నే వాళ్లిద్దరు ఎన్‌సీఏకు చేరుకోనున్నారు. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ‘‘రోహిత్, విరాట్ ఆగష్టు 23న ఎన్‌సీఏలో రిపోర్టు చేయనున్నారు.
అక్కడ ఆగష్టు 24- 29 వరకు క్యాంపులో గడుపనున్నారు’’ అని తెలిపినట్లు ఇన్‌సైడ్‌స్పోర్ట్ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో తొలి టీ20లో ఓడింది హార్దిక్ సేన. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. ఆదివారం గయానాలో రెండో టీ20 జరుగనుంది.
చదవండి: గిల్, జైశ్వాల్, కిషన్ కాదు.. అతడే టీమిండియా ఫ్యూచర్ స్టార్!
Comments
Please login to add a commentAdd a comment