
ముస్తఫిజుర్ ఆడతాడు!
సన్‌రైజర్స్ కోచ్ టామ్ మూడీ
హైదరాబాద్: ఐపీఎల్–10కు బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రహమాన్ పూర్తిగా దూరమైనట్లు వస్తున్న వార్తలపై తమకు స్పష్టత లేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కోచ్ టామ్ మూడీ అన్నారు. గత ఏడాది రైజర్స్ జట్టు చాంపియన్‌గా నిలవడంలో ముస్తఫిజుర్ కూడా కీలక పాత్ర పోషించాడు. శుక్రవారంలోగా అతను జట్టుతో చేరే అవకాశం ఉందని మూడీ వెల్లడించారు. ‘మాకున్న సమాచారం ప్రకారం ఈ నెల 7న ముస్తఫిజుర్ రావాలి. అతను రావడం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కాబట్టి అతను ఐపీఎల్‌లో ఆడతాడనే భావిస్తున్నాం’ అని మూడీ చెప్పారు.
డిఫెండింగ్ చాంపియన్‌గా తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని, గత ఏడాది విజయం ముగిసిన అధ్యాయమని కోచ్ చెప్పారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ వంద శాతం ఫిట్‌గా ఉన్నాడని, ఆస్ట్రేలియా నుంచి సరైన సమయంలో తిరిగొస్తాడని చెప్పిన మూడీ... శిఖర్ ధావన్ ఫామ్‌పై కూడా తాము ఆందోళన చెందడం లేదని స్పష్టం చేశారు. ఇద్దరు అఫ్ఘాన్ ఆటగాళ్లు నబీ, రషీద్ తమ జట్టుకు అదనపు బలంగా భావిస్తున్నట్లు ఈ ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ అభిప్రాయపడ్డారు. మరోవైపు సన్‌రైజర్స్ ఆటగాళ్లు క్రిస్ జోర్డాన్, బెన్ లాఫ్‌లిన్ ఈ సీజన్‌లో తాము అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.