బాగోట: ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ సమరంలో ఇంగ్లండ్ చేతిలో అనూహ్యంగా ఓడి ఇంటిదారి పట్టిన కొలంబియా ఆటగాళ్లకు అభిమానుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఇంగ్లండ్‌తో ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా పెనాల్టీ షూటౌట్‌లో గోల్స్ చేయడంలో విఫలమై జట్టు ఓటమికి కారణమైన కొలంబియా ఆటగాళ్లు మాటీస్, కార్లోస్ బాకాను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియా వేదికగా ఆ దేశ అభిమానులు చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు.
‘కార్లోస్.. నిన్ను ద్వేషిస్తున్నా. మీ అందరిపై ద్వేషంతో ఉన్నా. నీ ఉదాసీనత, నీ ఆటలో లోపం, జంతువును సూచించే నీ పేరు (స్పానిష్‌లో బాకా అంటే ఆవు). ఇలా అన్నింటినీ ద్వేషిస్తున్నా’ అని ఓ అభిమాని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. మాటీస్‌ను ఉద్దేశించి.. ‘నువ్వు చనిపోతావనే నమ్మకం ఉంది’ అని మరో అభిమాని తెలిపాడు. ‘మాటీస్‌కు అదే చివరి మ్యాచ్. ఎందుకంటే అతను ఇప్పటికే చనిపోయాడు’ అని వేరొక అభిమాని పేర్కొన్నాడు.
మరొకవైపు తమ ఆటగాళ్లను వెనకేసుకొచ్చే అభిమానులు కూడా ఉన్నారు. ‘బాకా, మాటీస్ చనిపోవాలని కోరుకోకండి. గతంలో ఆండ్రూస్ ఎస్కోబార్‌కు జరిగిందే మళ్లీ పునరావృతం కావాలని అనుకుంటున్నారా? ఇది కొలంబియానేనా?’ అని ఇంకో అభిమాని పోస్టు చేశాడు. 1994 ప్రపంచకప్‌లో యుఎస్‌తో మ్యాచ్‌లో సెల్ఫ్‌గోల్ కొట్టినందుకు కొలంబియా వీధుల్లో ఆండ్రూస్‌ను కాల్చిచంపారు. దాంతో ప్రస్తుత హత్యా బెదిరింపులు కొలంబియా ఫుట్‌బాల్ ఆటగాళ్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment