అంతరాత్మ అనుమతించింది
అంతరాత్మ అనుమతించింది
Published Thu, Oct 10 2013 1:03 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తీర్పుతో బీసీసీఐ చీఫ్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన ఎన్.శ్రీనివాసన్ ఈ అంశంలో తన అంతరాత్మ చాలా క్లియర్‌గా ఉందని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే పదవిని వదిలిపెట్టి పోలేదన్నారు. తన అల్లుడు, చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్‌పై ముంబై పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేసినా... బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు అంతరాత్మ అంగీకరించిందా? అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. తాను తప్పు చేయలేదు కాబట్టి ఈ మొత్తం ఉదంతంలో నైతికతకు తావులేదని స్పష్టం చేశారు. ‘కచ్చితంగా చెబుతున్నా నేను మరో రకంగా భావిస్తే ఈ పదవిని స్వీకరించేవాడిని కాదు.
ఆరంభంలో నేను ఏ మాటైతే చెప్పానో దానికే కట్టుబడి ఉన్నా. నేను తప్పు చేసి ఉంటే నా అంతరాత్మ అనుమతి ఇచ్చేది కాదు’ అని శ్రీని పేర్కొన్నారు. గురునాథ్‌పై జరిగిన విచారణలో తన ప్రమేయం లేదని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. ‘విచారణ మొదలైనప్పుడు నేను బోర్డు చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్నా. ఆ తర్వాత ఇద్దరు జడ్జిల కమిటీని బీసీసీఐ వర్కింగ్ కమిటీ నియమించింది. ఇందులో నా ప్రమేయం లేదు. కమిటీ ఇచ్చిన నివేదికను కూడా చూడలేదు. శ్రీశాంత్ కేసును కమిటీతో పాటు రవి సవానీ విచారించారు. వీళ్ల కార్యక్రమాలు, ఎన్ని సమావేశాలు జరిగాయో కూడా నాకు తెలియదు’ అని శ్రీనివాసన్ వివరించారు.
Advertisement
Advertisement