'ఓపెనర్లలో అతనే బెస్ట్'
లండన్: గతవారం పాకిస్థాన్ తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ డబుల్ సెంచరీ చేయడంపై ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ గ్రాహం గూచ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోనే కుక్ అత్యుత్తమ ఓపెనర్ అని కొనియాడాడు. పాకిస్థాన్ తో తొలి టెస్టు సందర్భంగా కుక్ 263 పరుగులు చేశాడు. సుదీర్ఘంగా 836 నిమిషాల పాటు క్రీజ్ లో ఉండి జట్టుకు కీలక ఇన్నింగ్స్ సాధించిపెట్టాడు. దీంతో అత్యధిక నిమిషాలు క్రీజ్ లో ఉన్న మూడో క్రికెటర్ గా కుక్ గుర్తింపు పొందాడు. కాగా, ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఎక్కువ సమయం క్రీజ్ లో నిలిచిన తొలి ఆటగాడిగా కుక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
'గొప్ప ఇన్నింగ్స్ లలో అదొక అత్యుత్తమ ఇన్నింగ్స్. కుక్ ఎప్పుడూ మానసికంగా చాలా దృఢంగా ఉంటాడు. యుక్త వయసు నుంచి అతనికి ఆటపై ఏకాగ్రత అమోఘం. చాలా కాలం వరకూ ప్రపంచంలోనే ఒక బెస్ట్ ఓపెనర్ గా కుక్ కొనసాగుతాడు' అని గూచ్ అభిప్రాయపడ్డాడు.