మృత్యువుతో పోరాడి ఓడిన యువ క్రికెటర్
కోల్ కతా: ఆస్ట్రేలియన్ క్రికెటర్ హ్యూస్ మృతి చెందిన ఘటన మరువక ముందే మరో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. అదే తరహాలో కోల్కతాలో అంకిత్ కేసరీ(20) అనే యువ క్రికెటర్ మృత్యువుతో పోరాటం చేసి సోమవారం తుదిశ్వాస విడిచాడు. గత శుక్రవారం ఈస్ట్ బెంగాల్ - భావన్ పురీ జట్ల మధ్య జరిగిన స్థానిక మ్యాచ్ లో భాగంగా క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన సమయంలో ఆ క్రికెటర్ మైదానంలో వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి మరో క్రికెటర్ను ఢీకొట్టాడు.
దీంతో ఆ యువ ఆటగాడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే అతని తలకు బలమైన గాయం కావడంతో డాక్టర్ సలహామేరకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే నాలుగు రోజుల పాటు మృత్యువుతూ పోరాటం చేసిన ఆ యువ క్రికెటర్ ఈరోజు ప్రాణాలు కోల్పోయాడు. గత రెండేళ్ల నుంచి బెంగాల్-19 కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేస్రీ.. ఈ సంవత్సరం బెంగాల్ అండర్-23 విభాగానికి ఎంపికయ్యాడు.
కాగా, యువ క్రికెటర్ అంకిత్ కేసరి మృతిపట్ల బాలీవుడ్ హీరో, కోల్కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అతడి కుటుంబానికి సంతాపం తెలిపాడు. ట్విట్టర్లో కూడా తన ఆవేదనను పంచుకున్నాడు.
Too young to go…extremely unfortunate & sad. Condolences & prayers for Ankit Keshri & his family. May Allah bless his soul. R.I.P.
— Shah Rukh Khan (@iamsrk) April 20, 2015