మూగజీవుల పట్ల క్రూరత్వం తగదు: ఓజా
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: జంతు ప్రదర్శనశాలల్లో జంతువులను బంధిస్తూ ఒక రకంగా వాటికి జైలు శిక్ష వేస్తున్నారని హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆందోళన వ్యక్తం చేశాడు. మూగజీవుల పట్ల క్రూరత్వం తగదన్నాడు. ఈ రకమైన చర్యలకు నిరసనగా పెటా ఆధ్వర్యంలో ఓజా తనను తాను ఓ బోనులో బంధించుకుని నిరసన వ్యక్తం చేశాడు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నెం. 5లోని అన్నపూర్ణ స్టూడి యోస్ గ్రాండ్ బాల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతను మాట్లాడుతూ... స్వేచ్ఛగా అడవుల్లో తిరగాల్సిన జంతువులను ప్రదర్శనశాలల్లో బంధిస్తూ ఆనందాన్ని పొందుతున్నారని... దీంతో అవి మానసికంగా ఎంతో కుంగిపోతున్నాయని వాపోయాడు.
నిర్వాహకుల క్రూరత్వం వల్ల మూగజీవులు తమ సహజ జీవన విధానానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయని చెప్పాడు. ‘తలరాతలు మార్చడం-జంతుశాలలకు తరలించడానికి స్వస్తి పలకండి అనే నినాదాన్ని అతను ప్రదర్శించాడు. జంతుప్రదర్శన శాలలకు వెళ్లవద్దని తన అభిమానులను ఈ సందర్భంగా ఓజా కోరాడు. కొద్ది సమయమే తాను బోనులో లాక్ చేసుకుంటే తలతిరుగుతోందని... అలాంటిది జీవితాంతం బోనులో ఉంచే జంతువుల పరిస్థితిని ఆలోచించాలన్నాడు.
బోనులో తనను తాను బంధించుకొని నిరసన వ్యక్తం చేస్తున్న క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా