లాహోర్‌కు చేరుకున్న వరల్డ్ ఎలెవన్ జట్టు
లాహోర్: గత ఎనిమిదేళ్లుగా ఏ జట్టు చేయని సాహసం ప్రపంచ ఎలెవన్ క్రికెట్ జట్టు చేసింది. 2009లో శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సు పై దాడి జరిగిన అనంతరం పాకిస్తాన్‌లో ఇంతవరకు ఏ అంతర్జాతీయ జట్టు పర్యటించలేదు. అయితే తాజాగా పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను ఆడేందుకు 13 మంది ఆటగాళ్ల ప్రపంచ ఎలెవన్ జట్టు ఈ రోజు లాహోర్ చేరుకుంది. ఈనెల 12, 13,15 తేదీల్లో లాహోర్లోని గడాఫీ స్టేడియంలో పాకిస్థాన్-వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య మూడు టీ 20 మ్యాచ్ లు జరుగనున్నాయి.
సుదీర్ఘ విరామం అనంతరం తమ దేశానికి విచ్చేసిన అంతర్జాతీయ ఆటగాళ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పటిష్ట భద్రత నడుమ ప్రత్యేక బస్సులో వారిని హోటల్‌కు తరలించారు. ప్రపంచ ఎలెవన్ జట్టుకు దక్షిణాఫ్రికా కెప్టెన్ డూప్లెసిస్ సారథ్యం వహిస్తున్నాడు. అయితే బీసీసీఐ నుంచి అనుమతి లేకపోవడంతో వరల్డ్ ఎలెవన్ తరపున భారత క్రికెటర్లు ఎవరూ పాల్గొనడం లేదు.
వరల్డ్ ఎలెవన్: డు ప్లెసిస్(కెప్టెన్-దక్షిణాఫ్రికా),హషీమ్ ఆమ్లా(దక్షిణాఫ్రికా), శామ్యూల్ బద్రీ(వెస్టిండీస్), జార్జ్ బెయిలీ(ఆస్ట్రేలియా), పాల్ కాలింగ్ వుడ్(ఇంగ్లండ్), బెన్ కట్టింగ్, గ్రాంట్ ఎలియట్(న్యూజిలాండ్), తమీమ్ ఇక్బాల్(బంగ్లాదేశ్), డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా), మోర్నీ మోర్కెల్(దక్షిణాఫ్రికా), టిమ్ పానీ(ఆస్ట్రేలియా), తిషారా పెరీరా(శ్రీలంక), ఇమ్రాన్ తాహీర్(దక్షిణాఫ్రికా), డారెన్ సామీ(వెస్టిండీస్)