
నిజ్నీ నోవ్‌గారోడ్(రష్యా): ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ దశలో దుమ్మురేపిన క్రొయేషియా జట్టు ఊహించినట్లే క్వార్టర్స్‌కు చేరింది. ఆదివారం రాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్‌లో క్రొయేషియా 3-2 తేడాతో డెన్మార్క్‌ను ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇరు జట్లు నిర్ణీత సమయానికి 1-1తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. పెనాల్టీ షూటౌల్‌లో క్రొయేషియా మూడు గోల్స్ సాధించగా, డెన్మార్క్ రెండు గోల్స్ మాత్రమే చేసింది. దాంతో క్రొయేషియా మరో నాకౌట్ సమరానికి సిద్ధమైంది. శనివారం ఆతిథ్య రష్యాతో క్రొయేషియా క్వార్టర్స్‌లో తలపడనుంది.
వరల్డ్ కప్‌లో క్రొయేషియా క్వార్టర్స్‌కు చేరడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1998లో ఫ్రాన్స్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో చివరిసారి క్రొయేషియా క్వార్టర్స్‌కు చేరగా, ఆపై ఇంతకాలానికి మరొకసారి క్వార్టర్స్‌లోకి ప‍్రవేశించింది.
నిన్నటి మ్యాచ్‌లో క్రొయేషియా-డెన్మార్క్‌లు మొదటి నాలుగు నిమిషాల వ్యవధిలోనే తలో గోల్స్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని అనిపించింది. కాగా, ఆపై ఇరు జట్లు అత్యంత రక్షణాత్మకంగా ఆడటంతో అదనపు సమయంలో కూడా గోల్స్‌ను సాధించలేకపోయాయి. దాంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని తేల్చారు.