
ప్రేక్షకులింకా స్టేడియంలో కుదురుకోనేలేదు...అభిమానులింకా టీవీల ముందు సర్దుకోనేలేదు...ఫటాఫట్... రెండు గోల్స్ పడిపోయాయి!ఆరంభం అదిరిందనుకుంటే... మళ్లీ స్కోరే లేదు!నాకౌట్ మొదటి రోజు రెండు దిగ్గజ జట్లు నిష్క్రమిస్తే...రెండో రోజు రెండు మ్యాచ్‌లూ పెనాల్టీ షూటౌట్‌కు దారితీశాయి!ఇందులో క్రొయేషియానే కొట్టేసింది... డెన్మార్క్ ‘అవుటైంది’...!
నిజ్ని నవ్‌గొరొడ్: సాకర్ ప్రపంచకప్ ప్రి క్వార్టర్స్‌లో మరో రసవత్తర పోరు. ఆదివారం రాత్రి మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా 4–3తో స్పెయిన్‌పై పెనాల్టీ షూటౌట్‌లో గెలుపొందగా... అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో ఫలితం వచ్చింది. కాకపోతే, మొదటిదాని కంటే ఇంకొంత ఉత్కంఠగా...! ఇందులో డెన్మార్క్ గట్టి పోటీనిచ్చినా, ఆఖరి కిక్ క్రొయేషియాదే. ఆజట్టు 3–2 తేడాతో నెగ్గింది. నిర్ణీత 90 నిమిషాలతో పాటు, అదనపు అరగంట ముగిశాక కూడా రెండు జట్లూ 1–1తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. అప్పటికీ తొలి, నాలుగో కిక్‌లను గోల్ కీపర్లు కాస్పర్ షమిచెల్ (డెన్మార్క్), డానిజెల్ కబాసిక్ (క్రొయేషియా) అడ్డుకోవడంతో స్కోరు 2–2తో నిలిచి ఉద్విగ్నత పతాక స్థాయికి చేరింది. అయిదో కిక్‌ను జొర్గెన్‌సన్ నెట్లోకి పంపడంలో విఫలం కాగా, రాక్టిక్ విజయవంతమయ్యాడు.
ఒకట్లో ఒకటి... నాలుగులో రెండోది
ఆటగాళ్లు గోల్‌పోస్ట్‌ల వద్దకు దూసుకురావడంతో వెంటవెంటనే ఇరువైపులా స్కోర్లు నమోదయ్యాయి. మొదటి నిమిషంలోనే దూరం నుంచి వచ్చిన పాస్‌ను పెనాల్టీ ఏరియాలో అందుకున్న మథియాస్ జొర్గెన్‌సన్... పెనుగులాట మధ్య గోల్ చేసి డెన్మార్క్‌ను ఆధిక్యంలో నిలిపాడు. తేరుకున్న క్రొయేషియా 4వ నిమిషంలోనే సమం చేసేసింది. కుడివైపు ప్రాంతంలో బంతిని దొరకబుచ్చుకున్న మారియో మన్‌డ్జుక్ చిక్కకుండా ముందుకెళ్లి గోల్‌గా మలిచాడు. క్రొయేషియా కళ్లెం వేసినా... డెన్మార్క్ ఆత్మవిశ్వాసంతో ఆడింది. కానీ, క్రొయేషియా మిడ్‌ఫీల్డ్‌ను దాటి డెన్మార్క్ ముందుకు వెళ్లలేకపోయింది. తీవ్ర స్థాయిలో శ్రమించినా ఎవరూ గోల్ చేయలేకపోయారు. దీంతో అదనపు అరగంట అనివార్యమైంది. జొర్గెన్‌సన్ ఫౌల్‌తో 116వ నిమిషంలో క్రొయేషియాకు పెనాల్టీ కిక్ దక్కింది. అయితే, మొడ్రిక్ కొట్టిన ఈ షాట్‌ను షెమిచెల్ నిలువరించాడు. ఇది తప్ప మెరుపులు లేకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌ను అశ్రయించారు. కీపర్ల ప్రతిభతో ఇందులో నాలుగో కిక్ వరకు హై డ్రామా నడించింది. అయిదో కిక్‌ను పొరపాటు చేయకుండా రాక్టిక్ నెట్‌లోకి కొట్టి జట్టుకు గెలుపును కట్టబెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment